మారేడ్‌పల్లి/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 26: ఎస్సీ, ఎస్టీ కమిషనర్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం నాటకీయ పరిణామంలో అరెస్టు చేశారు. తెల్లవారుజామున 5గంటలకే మారెడుపల్లిలోని శ్రీనివాస్ నివాసానికి చేరకున్న పోలీసులు తొలుత నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పి, చివరి నిమిషంలో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ ఠాణాలో నమోదైన కేసులో ఎర్రోళ్లను అరెస్టు చేస్తున్నట్లు లీగల్టీమ్కు పోలీసులు చివరి నిమిషంలో చెప్పారు. దీంతో అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు దొంగల రాజ్యం,దోపిడీ రాజ్యం…అంటూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనివాస్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్యం వాగ్వివాదం జరిగింది. ఒక దశలో ఇరువురి మధ్య తోపులాట జరగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డు తొలగించి శ్రీనివాస్‌ను అక్కడి నుంచి తరలించారు.
14 ఏండ్ల కిందట తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొనడమేంటని, ఆ కేసుల ద్వారా రెగ్యులర్ అఫెండర్‌గా ఎలా నిర్ధాస్తారని 3వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏ.కుమారస్వామి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 35(3) బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు తీసుకునేందుకు నిందితుడు నిరాకరించాడని, తమ పోన్లకు సమాధానమివ్వలేదనే విషయాల్ని రిమాండ్ రిపోర్టులో ఎక్కడా పొందపర్చలేదని మాసబ్‌ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరుశరామ్పై మెజిస్ట్రేట్ మండిపడ్డారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ తరుపు న్యాయవాది కిరణ్‌కుమార్ సుమారు అరగంటపాటు కోర్టుకు వాదనలు వినిపించారు. వాట్సాప్ ద్వారా లేదా, ఇంటికిగానీ 35(3) నోటీసుల్ని పంపించకుండా గురువారం తెల్లవారు జామున పోలీసులు ఇంటికెళ్లి బలవంతంగా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, లలితాకుమారీ తీర్పు ప్రకారం..ఎలాంటి కారణం లేకుండా నిందితుడిని అరెస్టు చేయకూడదని, ఈ కేసులోనూ ప్రధాన ముద్దాయిని సొంత పూచీ కత్తుపై విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది కోర్టుకు వివరించారు.
న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు రూ.5వేల చొప్పున రెండు సొంత పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎర్రోళ్ల శ్రీనివాస్ రెండు రూ.5వేల సొంత పూచీకత్తులను న్యాయస్థానానికి సమర్పించారు. అనంతరం కోర్టు నుంచే నేరుగా విడుదలయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ మన్నే గోవర్ధన్‌రెడ్డితో పాటు ఇతరులను పరారీలో ఉన్నట్లు పేర్కొంటూ.. పోలీసులు నోటీసులు జారీ చేయలేదన్నారు. సమాజంలో ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలో భాగంగా కావాలని పోలీసులు అరెస్టు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులన్నీ ఎత్తివేయడం జరిగాయని, వాటిని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారన్నారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారని, ఫోన్‌ట్యాపింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారని, అయితే ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడిపైనే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తప్పుడు కేసును నమోదు చేశారన్నారు. ఇన్స్పెక్టర్ కేఎం. రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు 126 (2), 127(20, 132, 224, 333, 351(3), 191(2), రెడ్‌విత్ 190, 3(5) బీఎన్ఎస్ సెక్షన్లన్నీ కూడా ఏడేండ్లలోపు శిక్షలున్నవేనని న్యాయవాది వివరించారు. ఏడేండ్లలోపు శిక్షలు కలిగిన సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో 35(3) కింద నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని సార్లు అరెస్టులు చేసినా..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, అరెస్టులకు భయపడేది లేదన్నారు. ఇది ప్రజా పాలన కాదు, దుర్మార్గమైన పాలన అని, ఈ పాలనలో కనీసం మాట్లాడే స్వేచ్చ కూడా లేదన్నారు.
హామీల అమలు అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు కాంగ్రెస్ సర్కార్ పాలనలో చూస్తున్నాం. కావాలనే సెలవు రోజుల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు.. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, పాలనపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి సారించారు. వేలాది మంది దళిత గిరిజన ప్రజలకు కమిషన్ ద్వారా న్యాయం చేసిన వ్యక్తికి మీరిచ్చే మర్యాద ఇదేనా?. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసు అక్రమం అనుకుంటే, ఆయనకు తోడుగా రక్షణగా వెళ్లిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం. తెలంగాణ పోలీసులకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే ముందు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో రేవంత్ బ్రదర్స్‌ను అరెస్టు చేయాలి.
– గజ్జెల నాగేశ్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజా పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారకముందే అరెస్టులు చేయడం ఏంది. ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడమే ప్రజా పాలనా. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించడం ఈ ప్రభుత్వంలో లేనట్టు కనిపిస్తుంది.నిజంగా నేరం చేసి ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వండి. అరెస్టు చేయాలంటే అరెస్టు వారెంట్ చూపించండి. ఇవేమి లేకుండా ఉగ్రవాది లెక్క తెల్లవారకముందే ఇంటికి వచ్చి పట్టుకెళ్లడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామికవాదులందరూ ఖండించాల్సిన అవసరముంది. ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరని ప్రజల పక్షాన నిలబడితే అరెస్టులు చేయడం ప్రజా పాలనలో కామన్ అయిపోయింది.అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, బ్లాక్మెయిల్ దందాలు రాష్ట్రంలో మాములైపోయాయి.
-మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఖండిస్తున్నా. నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేయడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అవుతుంది.రేవంత్ సర్కార్ అక్రమ కేసులను పెట్టి ప్రశ్నించే గొంతుకలను నొక్కాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
– ఉపేంద్ర, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు