TGPSC | టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పందించారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డనని తెలిపారు. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ టీజీపీఎస్సీ ఈ నోటీసులు ఇచ్చింది. ఆ వ్యాఖ్యలపై వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే ఈ నోటీసులపై రాకేశ్ రెడ్డి స్పందిస్తూ అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తానని స్పష్టం చేశారు.
గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవలపై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు తనపై పరువునష్టం దావా వేశారని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. ప్రశ్నిస్తేనే పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఇదే టీఎస్పీఎస్సీపై రోడ్డెక్కి మరీ ఎన్నో విమర్శలు చేశారని గుర్తుచేశారు. మరి అప్పుడెందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్త కాదని, పోరాటం కొత్త కాదని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతామని పేర్కొన్నారు. మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
టీజీపీఎస్సీ నోటీసులు
గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు జారీచేసింది. తమ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ వారం రోజుల్లో సమాధానం చెప్పకపోతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. అంతేగాక ఇకపై TGPSCపై రాకేష్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఆదేశించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది.