సమస్యలను పరిష్కరిస్తూ.. అభివృద్ధిని విస్తరిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రులు పేర్కొన్నారు. మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాలను ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజా ప్రతినిధులు పార్టీ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ తల్లి చిత్రపటాలు, అమరవీరులకు నివాళులర్పించారు. ర్యాలీలు నిర్వహించి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణలో మరోసారి అధికారం బీఆర్ఎస్దేనన్నారు. ఈసారి వందకు పైగా సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని.. ఎన్నికల్లో వాటికి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. మొత్తంగా 21 చోట్ల జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశాల్లో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొని సందడి చేశాయి.
విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఒక విజన్‌తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామ సమీపంలో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలతో సభాస్థలానికి తరలివచ్చారు. ముందుగా సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహేశ్వరానికి రావాల్సిన ఐటీఐఆర్‌ను కేంద్రం ఎందుకు రద్దు చేసిందో బీజేపీ నాయకులు తెలపాలన్నారు.
దేశ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయని, మోదీ పీఠం ఎక్కడ కదులుతుందోనని బీజేపీ నాయకులు ఆందోళనలో పడ్డారన్నారు. పాలమూరు – రంగారెడ్డి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా కల్పించలేదో చెప్పాలన్నారు. అభివృద్ధి చేయకుండా మందిర్, మజీద్ పేరుతో బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తానన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ఆమె బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కందుకూరు జడ్పీటీసీ బొక్క నర్సింహ్మారెడ్డి, తుక్కుగూడ వైస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, అరవింద్‌శర్మ, ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్‌గౌడ్, లక్ష్మీ నర్సింహ్మ, చంద్రయ్య, బడంగ్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, యువనేత కౌశిక్‌రెడ్డి, మహేశ్వరం అధ్యక్షుడు రాజునాయక్, తుక్కుగూడ అధ్యక్షుడు లక్ష్మయ్య, కందుకూరు అధ్యక్షుడు జయేందర్, యువజన విభాగం అధ్యక్షుడు ముద్ద పవన్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ నందీశ్వర్‌రెడ్డి, బడంగ్‌పేట ప్లోర్ లీడర్ సూర్ణగంటి అర్జున్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ యాతం పవన్‌కుమార్, సిద్దాల లావణ్య బీరప్ప, భూపాల్‌రెడ్డి, సంరెడ్డి వెంకట్‌రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.