ఎల్బీనగర్, మే 16:బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేసి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా బూత్ లెవల్ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలకు విధి విధానాలు, కార్యకర్తల ప్రాముఖ్యత, క్యాడర్ బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలతో నేరుగా మమేకం కానున్నారు.
నాయకులతో కాకుండా కార్యకర్తలతో కలిసి సమావేశంలో పాల్గొనడంతో పాటుగా వారితోనే భోజనాలు చేసి వారి అనుభవాలను తెలుసుకోనున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహిస్తున్న బూత్‌స్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గంలోని 580 మంది బూత్ లెవల్ ఏజెంట్లతో పాటుగా 500 మంది పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, 200 మంది మహిళా నేతలకు మొత్తంగా సుమారు 1280 మందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా..
నియోజకవర్గంలో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నాయకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రయోగాత్మంగా నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు పకడ్బందీగా శిక్షణకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసుకునే బూత్ స్థాయి ఏజెంట్లను ఇప్పుడే నియమించుకుని బూత్ స్థాయిలో ఓటర్ల పూర్తి డేటాను డిజిటలైజ్ చేసే పక్రియకు ఓ యాప్ ద్వారా శ్రీకారం చుట్టారు. ఇలా నియోజకవర్గంలోని పదకొండు డివిజన్లలో ఈ డేటాను సేకరించి రెడీగా ఉంచారు. ప్రధానంగా 580 బూత్‌లకు 580 మంది బీఎల్ఎలను పెట్టుకోవడంతో పాటుగా డివిజన్ స్థాయిలో ముఖ్య నాయకులు, పార్టీలోని అన్ని అనుబంధ సంఘాలు, ఉద్యమకారులతో చర్చించి మూడు నెలలుగా ప్రణాళికలు చేస్తున్నారు. అన్ని హంగులతో సిద్ధంగా ఉన్న ఎల్బీనగర్ పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సుశిక్షుతులగా మార్చేందుకు ప్రయోగాత్మకంగా శ్రీకారం చుడుతున్నారు.
ఒక్కో అశంపై దిశానిర్దేశం..
శిక్షణ కార్యక్రమంలో ఒక్కో నాయకుడు ఒక్కో అశంఫై క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. కార్యకర్తలకు శిక్షణ ఎందుకు అనే అంశంపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్యకర్తలకు శిక్షణ ప్రాముఖ్యతపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ సిద్దాంతం, ఉద్యమం అంశంపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఎన్నికలు, కార్యకర్తల బాధ్యత అంశంపై మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎస్ఐఆర్(సర్) అంశంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, 2014 కంటే ముందు తెలంగాణ, తర్వాత తెలంగాణ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొననున్నారు.

ఉద్యమ నేపథ్యం నుంచి..
ఉద్యమ నేపథ్యం మొదలుకుని పారీ ్ట అధికారంలోకి వచ్చే వరకు ఓ ఊపులో కేసీఆర్ నాయకత్వంలో సాగిన ప్రస్థావనానికి తాజాగా పార్టీ ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుని గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ క్యాడర్‌ను పకడ్బందీగా తయారు చేసుకుని కార్యకర్తలను సుశిక్షుతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శిక్షణకు శ్రీకారం చుడుతోంది. ఎన్నికల సమయంలోనే కాకుండా బూత్ లెవల్ నుంచి పార్టీ క్యాడర్‌ను తీర్చిదిద్దితే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారన్న లక్ష్యంతో ఈ శిక్షణకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. వీటిని ఒక్కో డివిజన్‌ను ఒక్కో గ్రూపుగా ఎంపిక చేశారు. వారు తమ డివిజన్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఒక్క గ్రూపుగా ఉంటారు.
ఇలా పదకొండు గ్రూపులకు కన్వెన్షన్‌లోని పదకొండు బాక్స్‌లు ఏర్పాటు చేసి వారు అక్కడే ఉండగా వారి వద్దకే కేటీఆర్ నేరుగా వెళ్లి కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే డయాస్‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకుండా నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, వివిధ విభాగాల ప్రతినిధులే ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తారు. కార్యక్రమానికి హజరవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ,నాయకులు కూడా ఒక్కో డివిజన్ వారితో మమేకమై వారితో మాట్లాడుతారు. వారితోనే కలిసి భోజనం చేస్తారు.
క్యాడర్‌ను పటిష్టం చేసేందుకే..
బీఆర్ఎస్ క్యాడర్‌ను పటిష్టంగా తయారు చేసేందుకే బీఎల్ఏలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమం చేపట్టాం. కేసీఆర్ న్యాయకత్వంలో బలమైన క్యాడర్ కలిగిన బీఆర్ఎస్ పార్టీకి క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు శ్రీకారం చుడుతున్నాం. కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు, వారే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతుతో మా నియోజకవర్గంలో శిక్షణకు శ్రీకారం చుట్టాం. మూడు నెలలుగా క్షేత్రస్థాయిలో 580 బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి వారి ద్వారా నియోకవర్గంలోని ఓటర్ల డేటాను సమీక్షరించాం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు బీఎల్ఏలకు, పార్టీ ముఖ్య శ్రేణులకు శిక్షణను అందిస్తున్నాం.
– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి