కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram Krishna Rao) అన్నారు. మంగళవారం కూకట్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి డివిజన్ బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ (KCR) పాలనలో రాష్ట్రంలో సుపరిపాలన సాగిందని, ప్రతి నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయన్నారు. వేలాది కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రాబోయే రోజులో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ఇప్పటికే ప్రజలు విసిగెత్తిపోయారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, కాలనీలు, బస్తీలలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి ప్రభాకర్, ఆయా కాలనీల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.