సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎన్నికల రణక్షేత్రంలో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడమే ధ్యేయంగా ప్రచారంలో దూకుడు పెంచింది. ఓవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గానికి ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూనే.. ప్రతిపక్ష పార్టీలకు దీటైన సమాధానం ఇచ్చేలా వార్ రూమ్ రూపకల్పన జరుగుతున్నది. సోషల్ మీడియా మొదలుకుని ప్రచార పర్వం వరకు అన్ని వ్యూహాలకు వార్‌రూమే వేదిక కానున్నది. ఇదే సమయంలో సీనియర్ నేతలకు పోలింగ్ కేంద్రం బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రతి డివిజన్లో రెండు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రచార పర్వాన్ని పర్యవేక్షించనున్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగార మోగడంతో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ముఖ్యంగా ఉప్పల్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్ సందడి షురూవైంది. మరో వైపు ఓటర్ల జాబితా విడుదల కావడానికి ముందుగానే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసింది. యువకులకు ఉద్యోగాలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పించన్లు, రైతు బంధు, బీసీలకు ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ పథకాల అమలు జరుగుతుంటే, రోడ్ల వెడల్పు, ఉప్పల్ జంక్షన్లో ఏర్పాటు స్కైవాక్ బ్రిడ్జి, భగాయత్ అభివృద్ధి, మినీ శిల్పారామం, డీఎస్ఎల్ ఐటీ పార్కు, మూసీ సుందరీకరణ, రేడియల్ రోడ్లు నిర్మాణాల వంటి అభివృద్ధి పనులు కూడా అనేకం పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా నియోజకవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం నేపథ్యంలోనే 2018లో కూడా గులాబీ పార్టీ విజయకేతనం ఎగురువేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించడం తథ్యం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికలను పరిశీలిస్తే..
ఇప్పటికే ఎన్నికల ప్రకటన విడుదలైంది. ఈ క్రమంలో అసెంబ్లీ పరిధిలో కూడా ఇప్పటికే ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఉప్పల్ నియోజకవర్గంలో గత ఎన్నికలను పరిశీలిస్తే ఓటర్లు పెరుగుతున్నారు. దీని ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఎక్కువగా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఉప్పల్ నియోజకవర్గంలో 510187 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అధిక సంఖ్యలో ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అభివృద్ధి, సంక్షేమమే కారణమవుతుందన్న అభిప్రాయలు వ్యక్తపరుస్తున్నారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు, ఓటర్ల తీరును పరిశీలిస్తే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత చరిత్రను పరిశీలిస్తే…
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పాటు జరిగింది. గతంలో మేడ్చల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఉప్పల్, కాప్రా మున్సిపాలిటీలను కలిపి ఉప్పల్ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మూడు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు, మూడు సార్లు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. స్థానికంగా జరిగిన ఎన్నికల ఫలితాలను బట్టి ఉప్పల్ ప్రజలు కారు వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తున్నది. గతంలో 2009లో ఉప్పల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 30 వేల ఓట్లు సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3,62,387 మంది ఓటర్లు ఉన్నా రు. అయితే ఇందులో 1,53,580 ఓట్లు పోలైనాయి. అంటే 42.38 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014లో 4,21,702 మంది ఓటర్లు నమోదయ్యారు. పోలింగ్ మాత్రం 2,25,935 ఓట్లతో.. 49.07 శాతం పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ ఫార్టీకి 82,395 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 34,331 ఓట్లు మాత్రమే సాధించింది. గత ఎన్నికల సందర్భంగా ఉన్న ఓట్లకు 59,315 ఓట్లు పెరిగాయి. అయితే గతంలో బీఆర్ఎస్కు 30 వేల ఓట్లు రాగా, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 82,395 ఓట్లు వచ్చాయి. ఓట్లు 59,315 పెరిగితే బీఆర్ఎస్ ఓట్ల సంఖ్య 52,395 ఓట్లు గతం కంటే పెరిగాయి.
2018 ఎన్నికల్లో..
2018 ఎన్నికలు వచ్చేసరికి 4,54,690 ఓటర్లు నమోదుకాగా, 2,27,899 ఓట్లు పోలైనాయి. వీటిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 1,17,442 ఓట్లు పోలైనాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మొత్తం ఓట్లు కలిపిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంటే తక్కువగానే వచ్చాయి. అయితే పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం బీఆర్ఎస్ రాగా..కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు కలిపి 69,274 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 26,798 ఓట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీలకు కలిపి 96,072 ఓట్లు మాత్రమే వచ్చాయి.
పెరిగిన ఓటర్లు..
2014తో పోలిస్తే 2018లో 32,988 ఓటర్లు పెరిగారు. 2014లో బీఆర్ఎస్కు 82,395 ఓట్లు రాగా.. 2018లో అనుహ్యంగా 1,17,442 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు గతం కంటే 35,047 ఓట్లు అధికంగా పెరిగాయి. అయితే ప్రస్తుతం 510187 ఓటర్లు ఉండగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరింతగా ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉన్నట్లు గత లెక్కలను బట్టి తెలుస్తున్నది. కార్పొరేటర్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. పది డివిజన్లలో 2016 గ్రేటర్ ఎన్నికల్లో 9 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకోగా, 2020లోనూ 10లో 6 గెలిచి మరో 4 నాలుగు స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చెందినా.. ఓటింగ్ శాతం పెరిగింది.