మారేడ్‌పల్లి, నవంబర్ 2: గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరం గెలుస్తున్నామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని, 78 సీట్లతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సనత్‌నగర్ నియోజకవర్గం మోండా డివిజన్ పరిధిలో ఆదయ్యనగర్, సాంబమూర్తినగర్, టకారబస్తీ తదితర ప్రాంతాల్లో సనత్‌నగర్, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….మూడో సారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ కావడం ఖాయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. తాను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగానని, ప్రజలందరూ ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత బస్తీ, కాలనీల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. ముఖ్యంగా ఈప్రాంతంలో రెండు స్లమ్స్, 18 బస్తీలు ఉంటాయని, ఈ ప్రాంతం ఉన్న ప్రతి ఒక్కరూ ఆప్యాయతగా పిలుస్తూ…స్వచ్ఛందంగా మద్దతు చెబుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని చెప్పారు.
కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్దే మంత్రి తలసాని
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్ఖానాలోని సాయన్న నివాసంలో కీలక భేటీ జరిగింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందన్నారు. ఈనెల 9న నామినేషన్ కార్యక్రమం ఉంటుందని.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
బీఆర్ఎస్లో 100 మంది చేరిక
సనత్‌నగర్ నియోజకవర్గం బేగంపేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్లకు వివిధ పార్టీల వారు సుమారు 100 మంది మంత్రి తలసాని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.