బడంగ్‌పేట, జూన్ 2: దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దపీట వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్ శివారు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్‌లోని శ్రీ శ్రీ కామరాతి బీరప్ప స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పురాతన దేవాలయాల అన్నింటిని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీర్చిదిద్దడం జరిగిందని గుర్తు చేశారు. దేవాలయాల అభివృద్ధికి గతంలో ప్రత్యేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. దేవాలయాలను కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి చేశారో యాదాద్రిని చూస్తే అర్థమవుతుందని అన్నారు. వేల కోట్ల రూపాయలతో దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలను పట్టించుకోవడం లేదన్నారు. గతంలో పండుగల సందర్భంగా దేవాలయాలకు నిధులు కేటాయించేవారని పేర్కొన్నారు. చర్చిలకు గాని, మజీదులకు గాని, దేవాలయాలకు గాని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా కేసీఆర్ కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు.