బంజారాహిల్స్/ఖైరతాబాద్,నవంబర్ 10: మా ఇంట్లో 15ఓట్లు ఉన్నాయి.. అవన్నీ కారుకే వేస్తామంటూ ఓ వృద్ధుడి భరోసా.. మంచిపనులు చేసిన కేసీఆర్‌కే మా ఓటు అంటూ మరో మహిళ హామీ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారంలో పాల్గొంటున్న కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించడానికి ముందే తామంతా కారు గుర్తుకే ఓటేస్తామంటూ చెప్పడం విశేషం.
శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాలంటే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కే ఓటేయాలని దానం నాగేందర్ కోరారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండ బస్తీలో స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్తో కలిసి అభ్యర్థి దానం నాగేందర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
గతంలో బస్తీల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలన్నా నిధులు అందుబాటులో ఉండేవి కావని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోట్లాది రూపాయల వ్యయంతో పనులు పూర్తిచేశామని దానం నాగేందర్ పేర్కొన్నారు. బస్తీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న దానం నాగేందర్‌కు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. తామందరం బీఆర్ఎస్కే ఓటేస్తామని, నిరంతరం అందుబాటులో ఉంటున్న బీఆర్ఎస్ను కాదని, వేరే పార్టీలకు ఓటేసే ప్రసక్తి లేదని ఓటర్లు భరోసా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, నాయకులు జావెద్, అక్బర్, రఫీక్, రవి, మహమూద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ స్థానిక మసీదుల వద్ద ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలను హుస్సేనీ మసీదు వద్ద మైనార్టీలకు అందజేశారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా నమాజ్‌కు వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారులు ఏకే సంఖాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.