Talasani Srinivas Yadav | ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీమంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మహాధర్నాకు ఆయన హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్టీసీ వేలాదిమంది ఉద్యోగుల శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించి సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసి ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలెక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని మండిపడ్డారు. ఎలెక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులతో నడిపించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టి ఎలెక్ట్రికల్ బస్సులను ఎలా నడుపుతారని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఉపాధిని దెబ్బతీయడానికా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది..? అని తలసాని ప్రశ్నించారు. నగరంలోని రాణిగంజ్, గౌలిగూడ తదితర 5 ఆర్టీసీ డిపోలను ఎలెక్ట్రికల్ బస్సులకు చెందిన ప్రయివేట్ సంస్థలకు అప్పగించారని, ఎవడబ్బ సొమ్మని ప్రయివేట్ సంస్థలకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్ లో తీర్మానించి గవర్నర్ కు పంపించడం జరిగిందని తెలిపారు. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, ఖచ్చితంగా ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీ లను వెంటనే అమలు చేయాలన్నారు. రిటైర్ ఉద్యోగుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు టార్గెట్ లు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఎలెక్ట్రికల్ బస్సుల నిర్వాహకులకు ప్యాసెంజర్లు లేకున్నా కిలో మీటర్ కు 56 రూపాయలు చొప్పున ఎలా చెల్లిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల 32 డిమాండ్లలో 29 ఆమోదించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం మాని ఆమోదించిన 29 డిమాండ్స్ ఏమిటో మీడియా ముఖంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతో నే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలా మాట్లాడటానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు.
ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడాలని, మీ వెంట మేమున్నాం అని భరోసా ఇచ్చారు. ధర్నాలో ఎమ్మెల్యే వెంట ఆర్టీసీ బీసీ ఉద్యోగుల హైదరాబాద్ రీజియన్ గౌరవ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, డిపో గౌరవ అధ్యక్షుడు కోటేశ్వర్ గౌడ్, యూనియన్ నాయకులు సంపత్, రాజయ్య నాయర్, సురేష్, స్వరూప, పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video