నగరం నిరసనలతో హోరెత్తింది..కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గర్జించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలవడాన్ని ఖండిస్తూ.. ఆదివారం గులాబీ నేతలు నిరసనలతో కదంతొక్కారు.. ఉద్యమ నేతకు అండగా ఉంటామంటూ.. ప్రతినబూనారు. దిష్టిబొమ్మల దహనాలు.. ర్యాలీలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు అత్యుత్సాహం చూపారు. అడుగడుగునా..దౌర్జన్యకాండకు దిగారు. వాహనాలకు గులాబీ జెండా కనిపించినా.. ఎవరైనా గులాబీ చొక్కా వేసుకున్నా.. వారిని ఆపి ప్రశ్నించడం, అదుపులోకి తీసుకోవడం కనిపించింది. ఎక్కడికక్కడే అరెస్టులు..గృహ నిర్బంధాలు..అడుగడుగునా అడ్డగింతలు యథేచ్ఛగా కొనసాగాయి.

మరోవైపు కేసీఆర్ నందినగర్ నివాసం అష్టదిగ్బంధమైంది. ఎటుచూసినా పోలీసులతో ఆ ప్రాంతమంతా ఖాకీమయమైంది. కేసీఆర్‌ను విచారించిన నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 3వేల మంది పోలీసులను మోహరించారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం భారీగా తరలివచ్చిన నాయకులు, అభిమానులకు పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్..జైజై కేసీఆర్..కాంగ్రెస్ ఖబడ్డార్’..అంటూ..గులాబీ శ్రేణుల నినాదాలతో నందినగర్ దద్దరిల్లింది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్ల తెలంగాణ కల సాకారం చేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సిట్ విచారణతో కక్ష సాధింపులకు దిగడంపై గ్రేటర్ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రజా నాయకుడిపై కుట్రలు ఆపాలంటూ గ్రేటర్ వీధులు నినాదాలతో దద్దరిల్లాయి.

ప్రతిపక్ష స్వరాన్ని అణిచే ప్రయత్నమే సిట్ విచారణ అంటూ గులాబీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీలు, నల్ల జెండాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు హోరెత్తించారు. రేవంత్ రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. గ్రేటర్ వ్యాప్తంగా ఆదివారం బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసినా నిరసనలు ఆగకపోవడం గమనార్హం.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, జాతిపిత కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకొని రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న నీచ రాజకీయాలపై గ్రేటర్ భగ్గుమన్నది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కట్టుకథలు అల్లుతూ, సిట్ విచారణ నెపంతో మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేయడంపై గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

ఆదివారం ఉదయమే నేతలు, కేసీఆర్ అభిమానులు రోడ్లపైకి వచ్చి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఉప్పల్, మల్లాపూర్, కాప్రా, ఖైరతాబాద్, రామచంద్రాపురం, కూకట్పల్లి, మియాపూర్, ఆల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.
పాలన చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్‌రెడ్డి ఈ సిట్ డ్రామాకు తెరలేపారని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.

ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, సికింద్రాబాద్‌తో పాటు ఓయూ క్యాంపస్‌లో విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు.

రాజకీయ కక్షతో చేస్తున్న ఈ విచారణలను చట్టపరంగా, ప్రజాక్షేత్రంలోనూ ఎదుర్కొంటామని బీఆర్ఎస్ శ్రేణులు ప్రతినబూనాయి. మున్సిపల్ ఎన్నికల వేళ భయంతోనే ప్రభుత్వం ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గోల్నాక: అసలు విషయమే లేని ఫోన్ ట్యాపింగ్ కేసును తెరమీదికి తెచ్చి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ధ్వజమెత్తారు.

అంబర్‌పేట నియోజకవర్గం నల్లకుంట చౌరస్తా వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వందలాది మంది గులాబీ కార్యకర్తలు తరలి వస్తున్న క్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఎండగడుతూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ కుతంత్రాలను తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది.
సిట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా విచారణ డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్వీ నాయకులు బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. జై కేసీఆర్ అంటూ నినదించారు.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని హితవుపలికారు. విచారణలకు, కేసులకు భయపడే వ్యక్తి కేసీఆర్ కాదనీ.. ఎన్నో ఆటంకాలను దాటుకొని తెలంగాణ సాధించిన అపర భగీరథుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు చెప్పారు.

-ఎర్రవల్లికి బయలుదేరుతూ.. అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్