మలక్ పేట ఏప్రిల్ 10: తండ్రి పింఛన్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడ్డ తమ్ముడు, అక్కను హతమార్చి అన్నను తీవ్రంగా గాయపరిచిన ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మలక్ పేట డివిజన్ వెంకటరమణ అపార్ట్ మెంట్లో గురువారం జరిగింది. ఎస్ఐ భరత్ కుమార్ కథనం ప్రకారం.. వెంకటరమణ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నంబర్ 101లో రఘుపతిరావు అనసూయ బాయి దంపతులు నివాసముంటున్నారు.
వీరికి ఐదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. రైల్వే ఉద్యోగియైన రఘుపతిరావు రిటైర్డ్ అయి 2010లో చనిపోయాడు. ఆయన పింఛన్ డబ్బులు భార్య అనసూయ బాయికి వస్తున్నాయి. తండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు మదన్ రావు కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు.
బుధవారం రాత్రి మదన్ రావు సహనాన్ని కోల్పోయి అక్క లక్ష్మి (68), అన్న సుదర్శన్(70) పై కత్తితో దాడి చేశాడు. లక్ష్మిని పొట్టలో నాలుగు సార్లు, ఛాతిపై మూడుసార్లు పొడవటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. భయపడ్డ మరో సోదరి (చెల్లి) పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న చాదర్ ఘాట్ పోలీసులు మదన్ రావును అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.