జగద్గిరిగుట్ట: హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ్ఎండీఏ తీసుకుంది. సుమారు 20 ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయించాలన్నది ప్రణాళిక. అయితే ఏడాది కాలంగా ఎలాంటి పనులు చేపట్టకుండా వదిలివేసిన హెచ్ఎండీఏ కేవలం ఓ వైపు మాత్రమే ఫెన్సింగ్, సరిహద్దు రాళ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇదే అక్రమార్కులకు కలిసివస్తున్నది.
లోతట్టు ప్రాంతం కావడంతో నెల రోజులుగా బయటి నుంచి తీసుకువచ్చిన నిర్మాణ వ్యర్థాలను ఇక్కడ పారబోస్తున్నారు. అయితే గతంలో హైడ్రా తొలగించిన నిర్మాణ వ్యర్థాలను ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఇదే ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు కొంద రు జగద్గిరిగుట్ట నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేట్ వ్యక్తుల భవన వ్యర్థాలను సైతం ఇక్కడికే తరలిస్తున్నారు. ఈ స్థలం వద్ద ఇద్దరు సిబ్బందిని కాపాలా ఉంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే గతంలో హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో వ్యర్థాలను పారబోసేవారు. ప్రస్తుతం అధికారిక హెచ్ఎండీఏ లే అవుట్లో డంప్ చేస్తున్నారు.
హైడ్రా పేరుతో దందా..
హైడ్రా కూల్చిన భవన వ్యర్థాలను ఇక్కడికి తరలిస్తుండగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు సైతం హైడ్రా పేరు చెప్పి ఇక్కడే పారబోస్తున్నారు. ట్రిప్పులకు లెక్కలు కట్టి ట్రాక్టర్‌కు రూ.300, టిప్పర్‌కు రూ.500 వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఎలాంటి రసీదులు, వాహనాల వివరాలు నమోదు చేయడం లేదు. తాము ఎక్కడో పారబోయాల్సి ఉంటుంది కావున అదేదో ఇక్కడే వేసి డబ్బులు చెల్లిస్తున్నామని వాహన డ్రైవర్లు వాపోతున్నారు. ఇదేమని ఇక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని.. హెచ్ఎండీఏ లే అవుట్ పనుల కోసం వసూలు చేస్తున్నామని వివరిస్తున్నారు. రోజూ సుమారు 500 వాహనాలు ఇక్కడికి వ్యర్థాలు తరలిస్తుండగా రూ. లక్షలకు పైగా వసూలవుతున్నా నగదు ఎవరికి చేరుతున్నది.. ఇందులో ఎవరెవరి వాటాలు ఎంతెంతో తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ దందా వెనుక ఉన్నతాధికారులు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా అధికారులు అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.
మా దృష్టికి రాలేదు..
హెచ్ఎండీఏ చేస్తున్న హెచ్ఎంటీఏ లే అవుట్లో పోస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలకు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో వివరాలు సేకరించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. నిర్మాణ వ్యర్థాలకు డబ్బులు వసూలు చేయడం అక్రమమే.
– డీసీ మల్లారెడ్డి