శేరిలింగంపల్లి, జూలై 13: గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) 23వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 600 మంది గ్రాడ్యుయేట్లు పట్టాలు అందుకున్నారు. వారిలో 125 మంది బీటెక్, 156 మంది ఎంటెక్, 16 మంది ఎంఎస్ఐటీపీ, 32 మంది పీహెచ్డీ పట్టాలను అందుకున్నారు. ట్రిపుల్ ఐటీలో విశేష ప్రతిభ చూపిన 13 మందికి బంగారు పతకాలు అందజేశారు.
ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ గోల్డ్ మెడల్‌ను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీఈ) బీటెక్ విద్యార్థి యర్రమనేని జైష్ణవ్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ ఆల్‌రౌండర్ గోల్డ్‌మెడల్‌ను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) బీటెక్ విద్యార్థి తాటిపాముల హర్షవర్ధన్ అందుకున్నారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కలైసెల్వీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కలైసెల్వీ మాట్లాడుతూ ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది కీలకంగా ఉండేదని, ఇప్పుడు ఏఐ, ఎంఎల్‌లు ముఖ్యభూమిక పోషిస్తున్నాయని చెప్పారు.