జవహర్నగర్, జనవరి 1: కొత్త సంవత్సరం వేళ జమ్మిగడ్డ ప్రాంతంలో విషాదం చేటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డు పక్కన నిల్చున్న ఓ యువకుడిని ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఈఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి జమ్మిగడ్డలో చోటు చేసుకుంది. ఎస్హెచ్వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం.. గోపగాని స్వామి, భార్య అరుణ, ఇద్దరు కుమారులు శివ, నందీశ్వర్తో కలిసి జమ్మిగడ్డలోని దేవీనగర్లో నివాసముంటున్నారు. 20ఏండ్ల క్రితమే నగరానికి వలస వచ్చిన స్వామి కుటుంబం కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
చిన్న కుమారుడు నందీశ్వర్(16) దూరవిద్యలో 10వ తరగతి చదువుతున్నాడు.గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జై జవాన్ కాలనీ కమాన్ పక్కన గల టీస్టాల్ వద్ద నందీశ్వర్ నిల్చొని ఉన్నాడు. దమ్మాయిగూడ నుంచి రాధికవైపు అతివేగంగా దూసుకువచ్చిన కారు నందీశ్వర్ను ఢీకొట్టింది. నందీశ్వర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.