సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఓవైపు బడులు పునఃప్రారంభం అయ్యాయనే సంబురం.. మరోవైపు చదువుకునేందుకు పుస్తకాలు లేవనే బాధ విద్యార్థులను వెంటాడుతోంది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో 11వేల మంది విద్యార్థులకు ఇప్పటివరకు పాఠ్య పుస్తకాల పంపిణీ జరగలేదు. ఈ విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల టీచర్లను నిలదీయగా.. “మీరు ఆధార్ కార్డు అందించలేదని.. మీ వివరాలు యూడైస్ యాప్‌లో ఎక్కలేదని’ చేతులు దులుపుకున్నారు.
అయితే యూడైస్ ప్రక్రియ అనేది అధికారుల చేతిలోనే ఉంటుంది. పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల, టీచర్ల వివరాలన్నీ అందులో నిక్షిప్తం చేస్తుంటారు. గతేడాది సైతం అందరి విద్యార్థుల వివరాలు సేకరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి సరిపడా పుస్తకాలు పాఠశాలలకు సరఫరా కాకపోవడంతోనే ఆధార్ సాకు చూపి చాలామంది విద్యార్థులకు పుస్తకాలను అందించలేకపోయారు.
ఆధార్ కార్డు లేకపోయినా విద్యార్థుల వివరాలు స్కూల్ రిజిస్టర్లో నమోదై ఉన్నాయి.. ఆ వివరాల ఆధారంగా పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తోటి స్నేహితులకు పుస్తకాలు వచ్చి తమకు రాకపోవడంతో వాళ్లంతా నిరుత్సాహం చెందుతున్నారు. ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధత్య తమపై నెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యకు సరిపడా అందని పుస్తకాలు..
జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో 94,339 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 713 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు సుమారు 12.50 లక్షల పుస్తకాలు, 6.20లక్షల నోట్‌బుక్స్‌ను ముద్రించినట్టు అధికారులు తెలిపారు. మండలాలవారీగా ప్రతీ పాఠశాలకు అందులో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పుస్తకాలను సరఫరా చేసినట్టు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా పుస్తకాలు అందటం లేదని విమర్శలున్నాయి. కాగా యూడైస్ వివరాల ఆధారంగానే విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు, వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫాం పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫరా జరుగుతుందని అధకారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా పుస్తకాలు అందనివారికి అందించాలని విద్యార్థుల తల్లదండ్రులు కోరుతున్నారు.