Fancy Number | సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): ‘ఆల్‌నైన్స్’ ఆర్టీఏ ఖజానాకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. సిరీస్ ఏదైనా ‘9999’ నంబర్ కోసం వాహనదారులు మనసు పారేసుకుంటున్నారు. తమ వాహనంపై ఆల్నైన్స్ను కేటాయించుకోవడం కోసం బిడ్డింగ్‌లో హోరా హోరీగా పోటీపడుతున్నారు. లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. ఒకవేళ ఆల్‌నైన్స్ మిస్సయితే మిగతా ఫ్యాన్సీ నంబర్లనైనా కైవసం చేసుకోవాలని ఆరాట పడుతున్నారు. మొత్తంగా ఫ్యాన్సీ ఫ్యాషన్ రవాణా శాఖకు భారీ ఆదాయాన్ని అందిస్తున్నది. దీంతో పాటు బర్త్‌డే, మ్యారేజ్ డే, లక్కీ నంబర్లు గుర్తుకొచ్చేలా నంబర్లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా గత 9 ఏండ్లలో రావాణా ఖజానాలో రూ.387 కోట్లు జమ అయింది. గత ఏడాది రూ.72 కోట్లకు పైగా ఫ్యాన్సీ ఆదాయం రాగా ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 53.66 కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా ఆల్‌నైన్స్ వాటానే అధికంగా ఉంది. ఫ్యాన్సీ నంబర్ల చరిత్రలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో ధర పలికిన నంబర్ ఖైరతాబాద్ సిరీస్(టీఎస్09) సిరీస్‌లో ‘9999’ నంబర్ రూ.21.60లక్షలకు అమ్ముడుపోవడం విశేషం.
ఫ్యాన్సీ నంబర్లను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం, ఒకే నంబర్ కోసం పదుల సంఖ్యలో పోటీపడుతుండటంతో ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నది. యువకులు రకరకాల బైకులు, కార్లు వాడుతుండటం వాటికి అనుగుణంగా ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీపడుతున్నారు. కొన్ని సంపన్న కుటుంబాలకు పరిమితమైన నంబర్లు..ఇప్పుడు మధ్య తరగతి వర్గాలకు సైతం పాకింది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఫీచర్లు, సౌకర్యాలు, రక్షణ ఏర్పాట్లు ఉన్న రకరకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మెచ్చిన ఫీచర్లతో వాహనాలు కొనుగోలు చేస్తున్నవారు వారి వారి హోదా, ఆర్థిక స్థితికి తగ్గట్టుగా నంబర్లను ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడంలో ఖైరతాబాద్ ఆర్టీఓ పరిధిలోని వాహనదారులది ప్రత్యేక రోల్. ఈ ప్రాంతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఉండటమే కారణం. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల ఆదాయంలో ఖైరతాబాద్ సిరీస్ నంబర్‌పైనే అధిక కాసులు కురుస్తాయి. టీఎస్09 సిరీస్‌కు బాగా డిమాండ్ ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు.
ఫ్యాన్సీ నంబర్‌పై ఆసక్తి ఉన్న బిడ్డర్లు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ వెబ్సైట్లోకి వెళ్లి కుడివైపు ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నంబర్ రిజర్వేషన్ అనే లింకు కనబడుతుంది. దానిని ఓపెన్ చేస్తే ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్లు ప్రత్యక్షమవుతాయి. అందులో నచ్చిన నంబరు కావాలనుకుంటే సంబంధిత నంబరు పేర్కొంటూ వాహన టీఆర్ నంబరును ఎంటర్ చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత వాహనదారుడు ఎంచుకున్న నంబరు ఆధారంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నంబర్ రిజర్వేషన్ కోసం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్ మొత్తాన్ని చెల్లిస్తే 5 గంటల వరకు నంబరు ఖరారై ప్రింట్ వస్తుంది. ఈ ప్రక్రియలో రిజిస్టర్ మొబైల్ నంబరుకు సందేశం వస్తుంది. ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040 23370081/83/84 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.