Jubleehills | జూబ్లీహిల్స్, జూలై 10 : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బోనాల పండుగ నిర్వహణ కోసం అమ్మవారి ఆలయాలకు నిధులు కేటాయించడం ప్రారంభమైంది. నాటి నుంచి బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకునేందుకు ఒక్కో నియోజకవర్గ పరిధిలోని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిర్వహణకు అమ్మవారి ఆలయాలకు రూ. 20 కోట్లు కేటాయించినట్లు ఇటీవల మేయర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 95 ఆలయాలకు రూ. 50.32 లక్షలు మంజూరయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడా, వెంగళరావు నగర్, రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వార్డులతో పాటు సర్కిల్-18 పరిధిలోని ఇతర డివిజన్లకు సంబంధించిన ఆలయాలకు ఆయా నిధులు మంజూరయ్యాయి.
రేపు చెక్కులు పంపిణీ..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆలయాలకు శుక్రవారం బోనాల చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఎర్రగడ్డలోని జీటిఎస్ టెంపుల్ లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆయా ఆలయాల కార్యనిర్వహణ అధికారులకు చెక్కులు అందజేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో చెక్కులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.