Lashkar Bonalu | బేగంపేట, జులై 13 : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్ అధ్యాత్మిక శోభ సంతరించుంది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఉదయం 4.10 నిమిషాలకు గంటలకు రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి బోనం సమర్పించారు. ఉదయం 11.40 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావ్, ఈవో గుత్తా మనోహర్ రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం, వీఐపీల కోసం వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రశాంత వాతావరణంలో జాతర జరిగేలా ఏర్పాట్లు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో అధికారులు తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకున్నారు. జాతరను తిలకేంచేందుకు వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది, వివిధ విభాగాల వాలంటీర్లు క్యూలైన్లలో ఉన్న భక్తులకు, బోనాల సమర్పించే మహిళలకు తాగునీటిని అందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందించారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాలయంలోకి వచ్చిన భక్తులు సాఫీగా బయటకు వెళ్లేందుకు ఆలయంలో మరో రెండు ద్వారాలు ఏర్పాట్లు చేసి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుంగా ఏర్పాట్లు చేశారు. వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నప్పటికీ కూడా ఆ సమయంలో బోనాల క్యూలైన్ నిలిపివేయకుండా అమ్మవారికి బోనాల సమర్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంతో పోలిస్తే ఈ ఏడు లక్షలాదిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆర్చి గేటు వద్ద భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక అవస్థలు పడ్డారు.
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని రాష్ట్రమంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గణేశ్, వరంగల్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమా దర్శించుకున్నారు. కేంద్రమంత్రి మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జీహెచ్ఎంసీ నగర్ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైకోర్టు జడ్జి నంద, మాజీ ఎంపీ అంజన్ కుమార్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి భక్తులు, మహిళలు, శివసత్తులు బోనాలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. శివసత్తులు వివిధ రకాల వేషధారణలతో బోనాలను తలపై పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాల సమర్పించారు. శివసత్తుల బోనాలను అధికారులను దేవాలయంలోకి అనుమతించారు. ఈ బోనాల సమర్పణతో లష్కర్ ఆధ్యాత్మిక శోభతను సంతరించుకున్నది.