సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : టిప్‌టాప్‌గా కనిపిస్తారు.. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చి పారేస్తారు.. ప్రశ్నిస్తే చితకబాదుతారు.. సాధారణంగా పబ్బులు, షాపింగ్ మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా వారిదే ‘బాడీ’బిల్డప్‌లు (Body Builders).. భూ వివాదాలు ఆస్తి తగాదాల్లోనూ.. తలదూర్చుతారు.. బెదిరించడం.. దాడికి దిగడం.. ఇదీ బౌన్సర్లు (Bouncers) సాగిస్తున్న అరాచకాలు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతీ ఘటనలోనూ వీరి ప్రమేయమే ఉంటున్నది.
ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్లు ఏం చేస్తున్నారు? వీరిని కట్టడి చేయడానికి అవకాశం ఉందా..? అనే దిశగా చర్చ జరుగుతున్నది. అత్యధిక బౌన్సర్లు జిమ్‌ల ద్వారా రిక్రూట్ అవుతుండడంతో 2005 నాటి ‘ది ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ యాక్ట్’ నిబంధనలు వీరికి వర్తించవని చెబుతున్నారు. దీంతో వీరి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది.
గతంలో భూవివాదాల్లో రౌడీషీటర్లు, స్థానిక నేతలు, గూండాలను పెద్ద మనుషులుగా పెట్టుకుని అవతలవారిని బెదిరించిన సందర్భాలుండేవి. ఇప్పుడు సీన్ మారిపోయింది. రౌడీల స్థానే బౌన్సర్లు వచ్చారు. వారు బెదిరిస్తారు.. అవసరమైతే దాడులు కూడా చేస్తారు. బార్ల నుంచి సినిమా ఫంక్షన్లు, నటీనటులకు రక్షణ ఇస్తున్నామంటూ వచ్చిన బౌన్సర్లు ఇప్పుడు భూ, ఆస్తి తగాదాల్లో తలదూరుస్తున్నారు. తమ ఆకారంతో ఎదుటివారిని భయపెడుతూ హంగామా సృష్టిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు ప్రతీచోటా పెద్దల వెనక బౌన్సర్లు కామన్ అయ్యారు. తమ వారి రక్షణ పేరుతో వీరు చేసే హడావుడి, దౌర్జన్యాలు వీధి రౌడీలకు తీసిపోకుండా ఉంటున్నాయని పోలీసులే చెబుతున్నారు.
బౌన్సర్లు, ప్రైవేటు బాడీగార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదు. బౌన్సర్లకైనా, ప్రైవేటు బాడీగార్డ్స్కైనా పరిమితులు ఉంటాయి. ఇలాంటి బౌన్సర్లు, బాడీగార్డులు, వీరిని సమకూర్చే సంస్థలు నిబంధనలకు లోబడి చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ఇది అల్లు అర్జున్ వ్యవహారం తర్వాత పోలీసులు ఇచ్చిన పబ్లిక్ ప్రకటన ఇది. కానీ తర్వాత బౌన్సర్ల హంగామా మరీ ఎక్కువైంది. ఏ వివాదం చూసినా బౌన్సర్లతోనే చేయిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఓ వివాదంలో మహిళా బౌన్సర్లు చేసిన హంగామాపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్ భూ వివాదంలోనూ కబ్జాదారులు బౌన్సర్లను పెట్టి హడావుడి సృష్టించారు.
అధికార పార్టీ నేతలు ఇప్పుడు తమ అనుచరుల కంటే బౌన్సర్లనే ఎక్కువగా నమ్ముకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. ఎక్కడికైనా వెళ్లినా, ఏదైనా వివాదాన్ని తేల్చాలన్నా తమ వెంట అంగరక్షకులు కాకుండా తమ ప్రైవేటు బాడీగార్డులుగా బౌన్సర్లను పట్టుకుని వెళ్తున్నారు. దీంతో బౌన్సర్లు తమ యజమాని ఏది చెబితే అది చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి పొంగులేటి కుమారుడు వట్టినాగులపల్లిలో చేసిన వీరంగంలో ప్రైవేటు సైన్యంగా చెప్పే బౌన్సర్లనే వాడడం కొసమెరుపు.
వీరికి పోలీసు ట్రీట్మెంట్ ఇచ్చినా మంత్రి సైన్యం కావడంతో వీరిపై పెద్దగా చర్యలు ఉండవనే చర్చ జరుగుతున్నది.
సైబరాబాద్ సీపీ మహంతి కఠినంగా ఉండడంతో ఈ బౌన్సర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు తప్ప.. మిగతా చోట్ల ఈ పరిస్థితే లేదని, భూమి వివాదాలు, ఆస్తి వివాదాలు ఉన్నచోట ఇప్పుడు రౌడీ షీటర్లకు బదులు ప్రైవేటు సైన్యమైన బౌన్సర్లే కనిపిస్తున్నారని ఓ పోలీసు అధికారి చెప్పారు. అల్లు అర్జున్ వివాదం సమయంలో బౌన్సర్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు పొంగులేటి కొడుకు వ్యవహారంలో వారిని కట్టడి చేస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.