మేడ్చల్, జూలై12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో కలిపి అత్యధికంగా జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.07 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. ఫారాల పంపిణిని మాత్రం 99.79 శాతం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ ఇందులో నిజం కనిపించడం లేదు.
సర్ ప్రక్రియ ప్రారంభమై 18 రోజులైనప్పటికీ ఇప్పటికీ ఫారాల కోసం ఓటర్ల వెతుకులాట కొనసాగుతున్నది. జిల్లాలో భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్న నేపథ్యంలో సర్ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉండగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం బీఎల్వోల ఇష్టారాజ్యంగా సర్ ప్రక్రియ సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో డిజిటలైజేషన్‌పై ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
సర్ ప్రక్రియ నిర్వహణ సజావుగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా సర్కిల్, మున్సిపాలిటీలు, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లతో ప్రయోజనం లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఫారాల పంపిణీ, ఫారాల నింపే సమాధానాలపై హెల్ప్‌డెస్క్‌లను సంప్రదిస్తే వారు సరైన సమాధానాలు ఇవ్యడం లేదని, ఫారాల కోసం బీఎల్వోలను సంప్రదించాలని బీఎల్వోలు ఫోన్ నెంబర్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఓటర్లు చేసేది లేక బీఎల్వోలకు ఫోన్లు చేసి వారి వద్దకే వెళ్లి ఫారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓటర్లు వాపోతున్నారు. సమీప వార్డు కార్యాలయాలకు వెళ్లి ఫారాలు తీసుకుంటున్నట్లు ఓటర్ల పేర్కొంటున్నారు. సర్ ప్రక్రియ గడువు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లకు మాత్రం పరీక్షగా మారింది. తమ ఓట్లు ఉంటాయో లేదో అన్న సందేహంలో ఉన్నారు. హెల్ప్‌డెస్క్‌లలో ఓటర్లకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి బీఎల్వోలను ఆదేశించారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియను జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి కలెక్టర్ మను చౌదరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్వోలు నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, స్వీకరణలను వేగవంతం చేయాలన్నారు. బీఎల్వోలు ఫారాలు ఇవ్వడం, తీసుకోవడంలో పూర్తి బాధ్యతగా వ్యహరించాలన్నారు. ఫారాలు పూరించడంలో ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ వారికి అవగాహన కల్పించాలన్నారు. తీసుకున్న ఫారాలను వెంట వెంటనే డిజిటలైజేషన్ చేయాలన్నారు. అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సూపర్వైజర్లకు అందించాలని బీఎల్వోలను కలెక్టర్ ఆదేశించారు.