కంటోన్మెంట్, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలు పేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కొనియాడారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు బాలంరాయి కమ్యూనిటీ హాల్లో పలు ప్రాంతాలకు చెందిన 9 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ..ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు.
ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే దళితుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న దళిత బంధు పథకంతో ప్రతి దళితుడి ఇంట్లో వెలుగులు విరజిమ్మనున్నాయని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఇలాంటి పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం దళితులపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, నేతలు నివేదిత, సంతోష్, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.