సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమను తాము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమ ఉజ్జీవులుగా చెప్పుకున్న కమలం పార్టీ.. కీలక సమయంలో చేతులు ఎత్తివేసింది. బీఆర్ఎస్ను నిలువరించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తమ భావజాలాన్ని సైతం పక్కన పెట్టి అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు మడుగులు వద్దింది. ఇరువురి లోపాయికారి ఒప్పందంతో పోలింగ్ రోజు (మంగళవారం) మధ్యాహ్నానికే బీజేపీ నేతలు ఎలాంటి హడావుడి లేకుండా పక్కకు తప్పుకున్నారు. దీనికి తోడు ఏకపక్షంగా తమకు పడాల్సిన ఓట్లను కూడా హస్తం పార్టీకి మళ్లించిందనే విమర్శలు ఉన్నాయి.
వైరుధ్యాలను పక్కనపెట్టి.. ఒక్కటైన జాతీయ పార్టీలు..!
పొలిటికల్ వైరుధ్యాలను పక్కనపెట్టి జూబ్లీహిల్స్ వేదికగా రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయి. బీఆర్ఎస్ను నిలువరించే క్రమంలో వైరాన్ని మరిచిన కమలం పార్టీ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసింది. యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన, బూత్ లెవల్లో పదుల సంఖ్యలో దొంగ ఓట్లు పడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు వాదించినా.. విషయం తెలిసి కూడా బీజేపీ నేతలు మౌనం వహించారు. అడపాదడపా బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్ చేసిన దాడులు కూడా ప్రణాళికబద్ధంగా జరిగినవే. కానీ ఎక్కడా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశం కమలం అగ్ర నేతల్లో లేకపోవడంతో.. పార్టీని నమ్ముకున్న నేతలు, వీరాభిమానం ఉన్నవారు కంటతడి పెట్టుకున్నారు.
ఆదినుంచీ అదే తీరు..
బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు ఒకే తీరుగా వ్యవహరించాయి. అందులో భాగంగానే పసలేని అభ్యర్థిని బరిలో దింపిన బీజేపీ.. కాంగ్రెస్‌కు లోపాయికారిగా మద్ధతునిచ్చింది. ఓ వర్గం ఓటర్లతో పాటు న్యూట్రల్ ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు ఆయా ఓట్లను కాంగ్రెస్ పార్టీకి మళ్లించేలా పక్కా ప్లాన్ ప్రకారం వెళ్లారు బీజేపీ నేతలు. పోలింగ్ సమయంలో ఎక్కడా హడావుడి లేకుండానే ఉన్న బీజేపీ నేతలు బూత్‌ల వద్ద కాంగ్రెస్ చేసిన అరాచకాలను సైతం ప్రశ్నించలేదు.
పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకువెళ్లినా, దొంగ ఓట్లు వేసినా నిలువరించకుండా మౌనం వహించింది. కనీసం సాయంత్రం 5గంటల తర్వాత గుట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను దాచిపెట్టి, ఒకేసారి పెద్ద ఎత్తునన పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో… జరిగిన సంఘర్షణలోనూ ఒక్క బీజేపీ నేత కనిపించలేదు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు పట్టం కటి.. బీఆర్ఎస్ను నిలువరించడమే లక్ష్యంగా కమలం పార్టీ నేతల తీరు స్పష్టంగా కనిపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.