Etala Rajender | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. వరద నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అటు బస్తీవాసులు, ఇటు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఒకనాడు వర్షాలు పడాలని కోరుకున్నాం. కానీ ఈరోజు వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. సర్వం తడిచి తినడానికి కూడా తిండి లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షుణ్ణంగా ఎస్టిమేట్ చేయించి మునగకుండా శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. వరద, మురుగు నీరు పోయేందుకు వేరువేరు పైప్ లైన్లు వేయాలి. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. డాంబర్ రోడ్లు అన్నీ గుంతలు పడ్డాయని ఈటల రాజేందర్ తెలిపారు.
75 శాతం ఆదాయం ఉన్న విశ్వనగరం.. రూ. 100, 200 కోట్లు కేటాయిస్తే ఎలా..? సిమెంట్ రోడ్లు వేయాలి. మునిగిన ఇళ్లకు రూ. 15 వేలు ఇవ్వాలి. తాత్సారం చేయవద్దు. బస్తీలో గోడలు తడిచిపోయాయి. ఫంగస్ వస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే అప్రమత్తం చేయాలి. రేవంత్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఆయనకు తీరికలేదు. కమిటీ వేసి అర్బన్ సమస్యలు మీద సమీక్షలు చేసి పరిష్కారం చూపాలని కోరుతున్నాను అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.