హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తేతెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించావు? ఆరు గ్యారెంటీలు అమలు చేశావా? పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా? వృద్ధుల పింఛన్లు పెంచినవా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. చేసిన ఒక్క మంచి పనిలేదు గానీ ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి సంచుల పంచాయితీకి తెర లేపారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలనను గాలికొదిలి మూటల పంపకాల్లో మునిగితేలుతున్నారని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్‌లో ఓటుతో బుద్ధి చెప్పి కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం పలుకుదామని ఓటర్లకు పిలుపునిచ్చారు. అక్కడ దెబ్బకొడితే మరో 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజవర్గంలోని చందానగర్‌కు చెందిన బీజేపీ నేత నవతారెడ్డి, శేరిలింగంపల్లి నాయకుడు మల్లికార్జునశర్మ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంగారెడ్డి, నాయకులు చందర్రావు, మోహన్‌రెడ్డి, దివ్యారెడ్డి, అనిత తదితరులు పెద్దసంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ మహిళా నేత, శేరిలింగంపల్లి కార్పొరేటర్ సింధూఆదర్శరెడ్డ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొంతకాలంగా బీఆర్ఎస్లో వెల్లువలా చేరుతున్న నేతలతో తెలంగాణ భవన్ కళకళలాడుతున్నదని చెప్పారు. ఈ చేరికలతో మళ్లీ కేసీఆర్ సర్కారు రావడం ఖాయమనే సందేశం ప్రజల్లోకి వెళ్తున్నదని పేర్కొన్నారు. ఉచిత హామీలు, డిక్లరేషన్ల గారడీలను నమ్మి ఓటేసి కాంగ్రెస్‌ను గద్దెనెక్కిస్తే రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. అత్తకు రూ.4 వేలు, కోడలుకు రూ.2500, యువతులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని నోటికొచ్చిన హామీలిచ్చి, 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసి పేద, మధ్య తరగతి బతుకులను అతలాకుతలం చేసిందని విమర్శించారు. హైడ్రా పేరిట బుల్డోజర్లను పంపి పేదల ఇండ్లను ధ్వంసం చేస్తున్నదని దుయ్యబట్టారు.
తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్..
తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని, ఏయిడ్స్ రోగిలా తయారైందని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్తే తనను ఎవరూ నమ్మడం లేదని, చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని తెలివి తక్కువ మాటలతో రాష్ట్ర పరువును గంగలో కలుపుతున్నారని ఎద్దేవా చేశారు. పాలన చేసే తెలివి లేక, ఆదాయం సృష్టించే దమ్ము లేకే అస్త్రసన్యాసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు పీఆర్సీ అడిగితే కోసుకుతింటారా..? ఏం చేస్తారు? అని ఎదురు ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమన్నారు.
నాడు కరోనా టైంలోనూ పథకాలు ఆగలేదు..
కేసీఆర్ పదేళ్ల పాలనలో రేవంత్‌రెడ్డిలా బేలమాటలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. కరోనా కాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ‘నాడు నయాపైసా ఆదాయం రాకున్నా వృద్ధుల పింఛన్లు ఆపలేదు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంలు నిలిపివేయలేదు, రైతుబంధు ఎత్తేయలేదు.. రైతుబీమా ఎగ్గొట్టలేదు..’ అని గుర్తుచేశారు.
భూముల కోసమే పార్టీ మారారు..
బీఆర్ఎస్ నుంచి 50 వేల మెజార్టీతో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రజల అభివృద్ధి కోసం పార్టీ మారలేదని ఆరోపించారు. కబ్జా చేసిన రూ.1100 కోట్ల విలువైన 11 ఎకరాలను కాపాడుకొనేందుకే హస్తం గూటికి చేరారని ఆరోపించారు. నిజంగా అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్తే రెండేళ్లలో ఏం ఉద్ధరించారని నిలదీశారు. కనీసం నియోజకవర్గంలోని రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే దొంగలెవరో, దొరలెవరో తెలిసివచ్చిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేను తిరిగి చేర్చుకొనే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
ఆడబిడ్డ కన్నీళ్లను అవహేళన చేశారు..
చేసిన పనులు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఆడబిడ్డ కన్నీళ్లను సైతం రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజల మధ్యకొచ్చి భర్తను తలుచుకొని ఏడిస్తే డ్రామాలు చేస్తున్నదని అపహాస్యం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ నేతల కుటుంబసభ్యులు మరణిస్తే వారు ఎడవరా? ఆడబిడ్డపై ఎందుకింత దుర్మార్గం అని నిలదీశారు. దుర్మార్గమైన కాంగ్రెస్ కండ్లు తెరిపించాలంటే జూబ్లీహిల్స్‌లో దిమ్మతిరిగేలా దెబ్బకొట్టాలని సూచించారు.
పుట్టింటికొచ్చినట్లు ఉంది: నవతారెడ్డి
బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లోకి రావడం పుట్టింటికి వచ్చినట్లు ఉన్నదని చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో శేర్లింగంపల్లిలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. రానున్న జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహ్మద్ గౌస్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.