గోల్నాక, మార్చి 26: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అంబర్‌పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్ అధ్యక్షతన చెన్నారెడ్డినగర్ ఎస్వీఆర్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యుల అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రావణ్‌కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరయ్యారు.
ముందుగా అంబర్‌పేట డివిజన్‌కు చెందిన పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు అబ్దుల్మాలిక్, రూబీస్టీవెన్సన్, రామారావుయాదవ్, వంజరి గంగరాజు, సింగజోగిశ్రీనివాస్ తదితరులను తలసాని సాయికిరణ్యాదవ్తో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రం వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు అంబర్‌పేట నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 15 ఏండ్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి, మూడేండ్లుగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు.
రాజకీయ లబ్ధికోసం వాడుకొని వదిలేయడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నైజమని మండిపడ్డారు. తలసాని సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేశ్‌ను కనీసం 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో అంబర్‌పేట డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పలు విభాగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.