సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోనే అత్యధిక జనాభాకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ పరిధికి ఫస్ట్ సిటిజన్‌గా వ్యవహరిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారా..? అటు మేయర్‌గా, ఇటు రాజకీయంగా విఫలం చెంది కాంట్రావర్సీకి కామన్‌గా మారారా..? అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఆమెకు సఖ్యత కొరవడిందా? ప్రజల మౌలిక వసతుల కల్పన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సమష్టిగా అందరినీ కలుపుకొనిపోవాల్సిన మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా..? అంటే కార్పొరేషన్ వర్గాలు అవుననే అంటున్నాయి. గడిచిన కొంత కాలంగా తరచూ ఏదో పార్టీ నేతలతో వివాదానికి కేరాఫ్‌గా మారుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచి ప్రతిపక్ష పార్టీల నేతల వరకు మేయర్ వ్యవహరిస్తున్న తీరు గ్రేటర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వరుస వివాదాల్లో..
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వరుసగా వివాదాల్లో చిక్కుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మేయర్.. తరచూ అన్ని పార్టీల నేతలతో వివాదాలు పెట్టుకుంటున్నారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని, అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని గులాబీ నేతలు మేయర్ తీరును ఎండగడుతూ వస్తున్నారు.
ఖైరతాబాద్, లక్డీకాపూల్‌లో హోటళ్లపై తనిఖీల సందర్భంలో అధికార పార్టీ నేతల నుంచే వివాదాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉప్పల్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం, గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో జరిగిన గ్రేటర్ నేతల సమన్వయ సమావేశంలో మేయర్ వ్యాఖ్యలు భారీ దుమారాన్ని రేపాయి. చివరకు మేయర్ తండ్రి, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇటీవల కాలంలో ఎంఐఎం పార్టీ నేతలతో తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు.
ఎమ్మెల్సీ భేగ్ ఎపిసోడ్ ముగియకముందే తాజాగా గత వారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంఐఎం పార్టీ సభ్యులతో గొడవకు దిగారు. చెరువుల పరిరక్షణలో ఆ పదకొండు చెరువులే ఎందుకని? మరిన్ని చెరువులను చేర్చుదామన్న ఎంఐఎం పార్టీ సభ్యుల ప్రతిపాదనను మేయర్ సున్నితంగా తిరస్కరించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనధికార మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
రాబోయే స్టాండింగ్ కమిటీలో పెట్టనున్న ఇతర ప్రతిపాదనలకు తమ ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ ఆమోదం ఎలా పొందుతారన్నది ఎంఐఎం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. స్టాండింగ్ కమిటీలో మేయర్ తీరుపై ఇప్పటికే సభ్యులు తమ నేత అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లారని, త్వరలోనే కాంగ్రెస్ పెద్దలను కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక బీజేపీ విషయానికొస్తే ప్రొటోకాల్ వివాదంతో పాటు మేయర్ కనిపించడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్ గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మొత్తంగా మేయర్ విద్యావంతురాలైనా.. రాజకీయ సమయానుకూలంగా రాజకీయ వ్యూహాలు రచించడం, ఎత్తుగడలు వేయడంలో విఫలమై.. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండడం గమనార్హం.
మేయర్ వివాదాల్లో కొన్నింటిని పరిశీలిస్తే….!
గోషామహల్ నియోజకవర్గంలోని చాదర్‌ఘాట్‌లో జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆజాద్(మోతి)మార్కెట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసి, కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతున్న రెండు చికెన్ షాపులను తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ బేగ్, కొందరు వార్డు మెంబర్లు అక్కడకు చేరుకుని జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారు.
సీజ్ చేసి తీసుకువెళ్లిన చికెన్‌ను బలవంతంగా తీసుకువెళ్లారు. తిరిగి 24 గంటల వ్యవధిలోనే షాపులను తెరిపించి యథేచ్ఛగా వ్యాపారం సాగేలా చేశారు. ఈ విషయంలో మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు. కానీ నేటికీ ఆ మార్కెట్లో మేయర్ ఆదేశాలు ఎక్కడ అమలుకు నోచుకోలేదు.
స్టాండింగ్ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు బాలానగర్‌లో మేయర్ పర్యటించిన సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జీ బండి రమేశ్‌కు సమాచారం లేకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్ పిలువకాగానే బాలానగర్‌లో పర్యటనకు ఎందుకు వచ్చారని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన మేయర్.. ఇంతకు మీరెవరూ..? మీతో నాకు పరిచయమే లేదు..? నన్నెందుకు సమాచారం ఇవ్వలేదని అడుగుతున్నారు…? మీ నంబర్లు నా వద్ద లేవుగా.. ఎలా సమాచారం ఇవ్వాలి’ అని అనడంతో కాంగ్రెస్ నేతలందరూ ఒక్కసారిగా విస్తుపోయారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీనగర్ బస్తీలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ముందు ఖాళీ స్థలంలో చాలా ఏళ్లుగా వారంతపు సంత నిర్వహిస్తుంటారు. సాయంత్రం నుంచి రాత్రి 10గంటల దాకా నడుస్తున్న ఈ సంతల్లో చిరు వ్యాపారుల వద్ద నుంచి మేయర్ మనుషులుగా చెలామణి అయ్యే కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి డబ్బులు వసూలు చేసుకుంటారు. ప్రతి శనివారం సుమారు రూ.15వేల నుంచి 18వేల దాకా హఫ్తా వసూల్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో హౌస్ ఓనర్స్‌గా వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా ఏర్పడిన ఈ గ్రూప్ చివరకు మేయర్ మనుషులు దాడి చేసే వరకు వెళ్లింది. మేయర్ మనుషుల జరిపిన దాడితో అవమానభారంతో బీజేపీ చెందిన మహిళ కార్యకర్త పావని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పావనీ మనుషులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్త రాజు ముదిరాజ్ సైతం మేయర్ మనుషులతో ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. మొత్తంగా వాట్సాప్ గ్రూప్‌లో పెద్ద దిక్కుగా ఉన్న మేయర్.. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాజకీయ కక్ష్య సాధింపు చేపట్టడం ఏమిటని బాధితులు, స్థానికులు ఆరోపణలు గుప్పించారు.