కంటోన్మెంట్, సెప్టంబర్ 27ః గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఇండ్లు లేని పేదల కోసం కంటోన్మెంట్ నియోజకవర్గానికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని బీజేపీ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు. రసూల్‌పురా నారాయణ జోపిడి సంఘం, సిల్వర్ కాంపౌండ్, గాంధీనగర్, శ్రీరాంనగర్ బస్తీల్లో కట్టించిన డబుల్బెడ్రూం ఇండ్లు రెండేళ్ళు ఆలస్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 388 మంది లబ్దిదారులకు శనివారం అందజేసింది.
ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శిలాఫలకం ఆవిష్కరించి లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్లో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో బోర్డు ఎన్నికల్లో రసూల్‌పురా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సదా కేశవరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించానని చెప్పారు.
ఆ సందర్భంలో నారాయణజోపిడి సంఘం బస్తీవాసుల దుర్బరమైన జీవితాన్ని కళ్ళారా చూశానని ఈటల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరానని చెప్పారు. అలా ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి బీజం పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ అంగీకరించడంతో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
కంటోన్మెంట్ బోర్డు స్థలం కేటాయిస్తే ఇండ్లు నిర్మిస్తాం
కంటోన్మెంట్ బోర్డు స్థలాలు కేటాయిస్తే తాము రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ సూచన మేరకు గతంలో నిర్మించిన వాంభే ఇళ్లకు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, అడిషనల్ కలెక్టర్ ముకుంద్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, హౌసింగ్ ఎండీ గౌతమ్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ చక్రవర్తి, సికింద్రాబాద్ తహశీల్థార్ పాండునాయక్, తిరుమలగిరి తహశీల్థార్ భిక్షపతి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేత చేతుల మీదుగా పట్టాలు అందుకున్న లబ్దిదారులు
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు టిఎన్. శ్రీనివాస్‌ల చేతుల మీదుగా కొందరు లబ్దిదారులు ఇళ్ల పట్టాలను అందుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న తమ ఇండ్ల కోసం ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. టీఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.42 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు.
్రప్రొటోకాల్ రగడ.. బీజేపీ, కాంగ్రెస్ తోపులాట
నారాయణ జోపిడి సంఘం వద్ద డబుల్బెడ్రూం ఇండ్ల శిలాఫలకంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద పేరు లేకపోవడంతో అధికారులను ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర మంత్రులు పొన్నం, పొంగులేటి, ఎంపీ ఈటల రాజేందర్ సాక్షిగా ఇరు పార్టీల నేతలు తోపులాటకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించివేశారు. సభ ప్రారంభమైన అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ‘నీ పదవికి గౌరవం ఇచ్చి నీపేరు చదువుతాము, కానీ ఏ అర్హత లేని నీ భర్త పేరు చదవను’ అని భానుక నర్మదను ఉద్దేశించి వ్యాఖ్యనించడం గమనర్షం.