ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 5: ప్రతిపక్ష పార్టీలు ప్రజా విశ్వాసం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి కాచవానిసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలకు కావాల్సిన అన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తూ.. ప్రజల విశ్వాసం పొందినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధితో ప్రతిపక్ష పార్టీలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. కాచవానిసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యులు రాజ్ కుమార్, బండిరాల రాములు, సత్యారెడ్డి, అంజన్ కుమార్, విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు రాజు చారి, కార్యదర్శి కృష్ణచారి, మేస్త్రీ సంఘం అధ్యక్షుడు యాదగిరి, వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు అశోక్‌తో పాటు మరో 50మందికి పైగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కాచవానిసింగారం సర్పంచ్ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.