గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 08:07:33

కొట్టేసిన సొమ్ము.. బిట్‌కాయిన్లలోకి..!

కొట్టేసిన సొమ్ము.. బిట్‌కాయిన్లలోకి..!

  • ఒక బిట్‌కాయిన్‌ విలువ.. రూ.10లక్షలకు పైగానే
  • డిజిటల్‌రూపంలోకి డబ్బు మార్చాలంటూ ఒత్తిళ్లు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నేరగాళ్లకు డిజిటల్‌ రూపంలో చలామణి అవుతున్న మనీ కలిసివస్తున్నది.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ గిరాకీ ఉన్న బిట్‌కాయిన్‌ను ఈ నేరగాళ్లు ఎంచుకుంటున్నారు. హ్యాకర్లు.. కిడ్నాపర్లు... సైబర్‌నేరగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రూపాయలు, డాలర్లు, పౌండ్లు, యూరో తదితర కరెన్సీలను బిట్‌కాయిన్లలోకి మార్చి తమకు పంపించాలంటూ డిమాండ్‌ చేస్తూ సేఫ్‌సైడ్‌ గేమ్‌ ఆడుతున్నారు. బిట్‌కాయిన్‌ రూపం లో డిమాండ్‌ చేస్తున్న ఘటనలు ఇటీవల హైదరాబాద్‌లోనూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సైబరాబాద్‌ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన డాక్టర్‌ను నేరగాళ్లు రూ. 10 కోట్లు డిమాండ్‌ చేశారు... వాటిని కూడా బిట్‌ కాయిన్లలో తమకు పంపించాలంటూ సూచించారు. ఇప్పుడు ఈ బిట్‌కాయిన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఇద్దరు వ్యాపారుల బ్యాంక్‌ ఖాతాల హ్యాకింగ్‌ ఘటనల్లో రూ. 86 లక్షలు, ముంబైలో జరిగిన రూ. 2 కోట్లలో 60 శాతం బిట్‌కాయిన్లలోకి మార్చి, వాటిని నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లకు కోల్‌కతాలో ఉంటూ మధ్యవర్తిత్వం చేసిన సైబర్‌ చీటర్స్‌ పంపించారు.

బిట్‌ కాయిన్‌ అంటే..

బిట్‌ కాయిన్‌ అంటే రూపం లేని డిజిటల్‌ మనీ (క్రిప్టో కరెన్సీ). 2008లో దీనిని కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా సతోషి నకమోటో అనే వ్యక్తి తయారు చేశారని చెబుతారు. 2009 నుంచి వాడుకలో వచ్చింది. దీనిని ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్‌ చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ఎక్కువ సామర్థ్యం కల్గిన కంప్యూటర్ల సమూహం ద్వారా తయారు చేసిన ఈ డిజిటల్‌ మనీకి బిట్‌కాయిన్‌ అనే పేరు పెట్టారు. కేవలం 21 వేల మిలియన్ల బిట్‌కాయిన్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే 16 వేల మిలియన్ల బిట్‌కాయిన్లు అమ్ముడుపోయాయి. పరిమితమైన సంఖ్యలో ఈ బిట్‌కాయిన్లు ఉండటంతో వీటికి ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగి, దాని విలువ రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్‌ విలువ రూ. 10 లక్షలకు పైగానే ఉంది. ఎవరి నియంత్రణలో లేకుండా తమ సొంత అల్గార్థమ్‌తో తయారు చేసిన ప్రోగ్రామ్‌ మేరకు బిట్‌ కాయిన్లు తయారు కావడంతో, వీటి క్రయ విక్రయాలన్నీ డిజిటల్‌ రూపంలోనే జరుగుతాయి. షేర్‌ మార్కెట్‌ మాదిరిగానే బిట్‌కాయిన్‌ కొనుగోలు, అమ్మకాలు నిత్యం జరుగుతుంటాయి. 

హ్యాక్‌చేసి.. ఖాతాల్లోకి బదిలీ 

నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు.. ఎక్కడో ఉండి ఖాతాలు హ్యాక్‌ చేశాడు. హ్యాక్‌ చేసిన తరువాత నగరానికి చెందిన వ్యాపారుల ఖాతాల నుంచి డబ్బును కోల్‌కతాలోని కొందరి ఖాతాల్లోకి బదిలీ చేయించాడు. ఆ బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సరఫరా చేసే ముఠా.. సైబర్‌ నేరగాడు కొట్టేసిన మొత్తం సొమ్ములో 40 శాతం తమ సొంతానికి వాడుకుని.. మిగతాది నైజీరియన్‌ సైబర్‌నేరగాడు పంపించిన ఒక లింక్‌తో అతడి బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ ఖాతాను ఓపెన్‌ చేసి.. అందులో బిట్‌కాయిన్లు కొనేశారు. దీంతో ఆ డబ్బంతా అతడికి డిజిటల్‌ రూపంలోకి మారిపోయింది. ఇలా.. తాజాగా సైబరాబాద్‌లో జరిగిన వైద్యుడి కిడ్నాప్‌ ఘటనలోనూ ప్రధాన నిందితులిద్దరు ఆస్ట్రేలియాలో కొన్నాళ్లున్నారు. అక్కడ బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెట్టారు. దీనిపై మంచి అనుభవం ఉండటంతో రూ. 10 కోట్లను తమకు బిట్‌ కాయిన్లలో కావాలంటూ డిమాండ్‌ చేశారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా బిట్‌కాయిన్‌ను ఎంచుకున్నారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహారించి డబ్బు వ్యవహారాలు లేకుండానే, కిడ్నాప్‌నకు గురైన బాధితుడిని కాపాడటంతో సక్సెస్‌ సాధించారు.

నేరగాళ్లకు సురక్షితమైనవి..

ఈ బిట్‌కాయిన్లు నేరగాళ్లకు సురక్షితమైనవిగా మారాయి. బిట్‌ కాయిన్లలో డబ్బు పంపితే ఆ వివరాలు తెలుసుకోవడం కష్టం. పంపించిన వ్యక్తి ఎవరు.. ఎక్కడికి వెళ్లాయనే విషయాలు తెలుసుకోవడం కష్టమైన పని. ఆ వివరాలు బయటకు రావు. అందుకే హ్యాకర్లు, కిడ్నాపర్లు.. బిట్‌కాయిన్లలోనే పేమెంట్‌ చేయాలంటూ ఇటీవల ఎక్కువగా అడుగుతున్నారు. ఈ బిట్‌కాయిన్స్‌ ద్వారా సులువుగా పెద్ద మొత్తంలో డబ్బు పంపించుకోవచ్చు. ఈ బిట్‌కాయిన్ల ద్వారా షాపింగ్‌ చేసుకునే అవకాశం కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లు ఇక్కడ కొళ్లగొడుతున్న డబ్బును బిట్‌కాయిన్ల ద్వారా తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తూ తమ దేశంలో వాటిని డెలివరీ చేసే విధంగా చేసుకుంటున్నారు.