సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్‌ను అమలు చేయనున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం ద్వారా అవినీతి, అక్రమాలు జరగడంతో పాటు రాష్ర ్టవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ అవుతున్నాయని గుర్తించారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి మేరకు పురపాలక శాఖ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఆర్ఎస్ విధానం ద్వారా అక్రమాలకు తావులేకుండా ఉంటుందని అధికారులు భావించారు.
వచ్చే నెల మొదటి వారం నుంచి సీఆర్ఎస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విధానం జీహెచ్ఎంసీ అవతల ఉన్న మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విధాన అమలుపై పూర్తిగా అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి తొలుత శిక్షణ ఇచ్చి అమలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, ప్రతి బర్త్ సర్టిఫికెట్ , డెత్ సర్టిఫికెట్లకు యూనిక్ ఐడీ ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ఆప్డేషన్ జరుగుతుంది.