మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో పాటు ఉద్యోగులు సమయపాలన పాటించని నేపథ్యంలో బయోమెట్రిక్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ పనుల కోసం జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్న ప్రజలకు అధికారులు, ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో తరచూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో డిసెంబర్ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. కలెక్టరేట్లో ఒక అంతస్తుకు రెండు చొప్పున గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తంగా ఆరు బయోమెట్రిక్ యంత్రాలను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ పద్ధతి అమల్లోకి వస్తే వివిధ శాఖల విభాగాల అధికారులు ఉద్యోగులు, సిబ్బంది హాజరు నమోదు, సమయపాలనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు.