సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ ) :జీహెచ్ఎంసీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఏఎంఓహెచ్‌లు, ఎస్ఎఫ్ఏలు, జవాన్ల చేతిల్లో నుంచి తొలగించి ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్‌ల బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మెడికల్ ఆఫీసర్లను కాదని బిల్ కలెక్టర్లు, ఏఎంసీలకు ట్రేడ్ లైసెన్స్ బాధ్యతలు అప్పగించడం పట్ల బల్దియాలో చర్చకు దారి తీసింది. చట్ట విరుద్ధమని వైద్యాధికారులు చెబుతుండగా…పారదర్శకతలో భాగంగానే ప్రక్షాళన చేపడుతున్నట్లు కమిషనర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ (8) ప్రకారం ప్రమాదకరమైన వ్యాపారాలు లేదా పద్ధతులను నియంత్రించడం కార్పొరేషన్ తప్పనిసరి విధి.
అలాగే బై లాస్ 1973లోని బైలా 21 ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే ముందు మరుగుదొడ్లు, డ్రైనేజీ, కలుషిత నీటి నియంత్రణ ఇతర వాటని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే మెడికల్ ఆఫీసర్ సంబంధిత వ్యాపార సంస్థకు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేస్తారు. ఇప్పుడు ఈ అధికారాన్ని ఇతరులకు బదిలీ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని, పర్యావరణ పరిరక్షణ చట్టం వంటి జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని కొందరు చెబుతున్నారు.
ఆరోగ్య పరీక్షలు లేకుండా లైసెన్స్‌లు ఇచ్చే అవకాశం ఉందని, ప్రమాదకర నిర్ణయమంటున్నారు. నిపుణులైన ఆరోగ్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల లైసెన్సింగ్ ప్రక్రియలో పాదర్శకత లోపించి లంచనాలకు, బినామీ లావాదేవీలకు ఆస్కారం పెరుగుతుందని వారు చెబుతున్నారు. ఏఎంసీలు లైసెన్స్‌లు ఇచ్చినా తర్వాత హెల్త్ ఆఫీసర్లు పరిశీలించి ఆరోగ్య ప్రమాణాలు లేవని మూసేస్తే సదరు వ్యాపారి నష్టపోయే అవకాశం ఉందని చర్చ లేకపోలేదు.
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా..ప్రస్తుతం లైసెన్స్‌ల ఫీజు, వసూళ్ల బాధ్యత, పర్యవేక్షణ, సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ (ఏఎంఓహెచ్)ల నుంచి బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లోపంలో క్షేత్రస్థాయిలో లైసెన్స్‌లు లేని వ్యాపారుల నుంచి అందినంత దండుకోవడం, ట్రేడ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని రూ. 10వేలు అయ్యే చోట సదరు వ్యాపారస్తుడి నుంచి రూ. 60వేలు వసూలు చేస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయి.
ఇటీవల జూబ్లీహిల్స్‌లో ఎస్ఎఫ్ఏలు ఈ అంశాలపైనే ఏసీబీకి చిక్కడం గమనార్హం. అంతేకాకుండా కొన్ని చోట్ల ఫీజు వసూళ్లలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించి ఖజానాకు గండి కొడుతున్నారు. వాస్తవంగా 20 ఫీట్ల మేర సింగిల్ లేన్ రోడ్డు ఉంటే చదరపు మీటర్‌కు రూ.3లు, డబుల్ లేన్ రోడ్డు ఉంటే 20 నుంచి 30 ఫీట్ల మేర ఉన్న రోడ్లపై చదరపు ఫీట్‌కు రూ. 4, రెండు లేన్ల కంటే ఎక్కువగా ఉండి 30 ఫీట్లకు మంచిన రోడ్లపై చదరపు మీటర్‌కు రూ. 6ల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రీనరీ చార్జీలు కూడా చెల్లించాలి. సంబంధిత వ్యాపారి నేరుగా ఆన్లైన్లో ఈ ఫీజు చెల్లించే వీలు ఉంటుంది.
కానీ వ్యాపారస్తుల వద్దకు వెళ్లి భేరసారాలు అడుగుతున్నట్లు అరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు రూ. లక్ష ఇచ్చే వారి దగ్గర రూ. 50వేల వరకు తీసుకుని వదిలేస్తున్నారు. సదరు వ్యాపారస్తుడి నుంచి వచ్చిన ఫీజు బల్ధియా ఖజానాకు చేరడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. కమిషనర్ తీసుకున్న తాజా నిర్ణయం సత్పలితాలు ఇస్తారా? వివాదం మరింత ముదురుతుందా అన్నది వేచి చూడాల్సిందే..!