Hyderabad | హైదరాబాద్ బాలానగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు.ఆదివారం మధ్యాహ్నం సమయంలో చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా కారణంగా బైక్ అదుపుతప్పడంతో వాహనదారుడు కిందపడ్డాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంగా కారణంగానే వ్యక్తి మృతిచెందాడని వాహనదారులు ఆందోళకు దిగారు. దీంతో ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ వాహనదారులు, బాధిత కుటుంబసభ్యులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. దీంతో నర్సాపూర్ వెళ్లే రహదారిలో జీడిమెట్ల నుంచి బాలానగర్ వరకు వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాగ్వాదానికి దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.