కాంట్రాక్టర్, ఇంజినీరు కలిసి బల్దియా ఖజానాకు కన్నం పెట్టారు. సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్టుగా బిల్లులు పెట్టి దోచుకున్నారు.. చివరకు వీరి భాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. క్వాలిటీ కంట్రోల్ విజిలెన్స్ నివేదిక ఆధారంగా కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ అన్సారీని విధుల నుంచి టర్మినేట్ చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈఈ ఏకాంబరంపై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. సదరు కాంట్రాక్ట్ సంస్థ నుంచి రూ.8.93 లక్షలను రికవరీ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
– సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ):
సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఇటీవల మాన్సూన్ ఎమర్జెన్సీలో భాగంగా ఇసుజు వాహనాల టెండర్లలో అక్రమాలకు తెరలేపడం, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి సంబంధిత టెండర్‌ను రద్దు చేసి మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించారు. తాజాగా చేయని పనులకు బిల్లులు పెట్టి ఖజానాకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వర్తిస్తున్న పురపాలక శాఖ పరిధిలో జీహెచ్ఎంసీలో అవినీతి తంతు తారాస్థాయికి చేరడం, జీహెచ్ఎంసీపై పురపాలక శాఖ మంత్రిగా ఇప్పటివరకు సమీక్ష జరపకపోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారుల చేతివాటం బట్టబయలైంది. పనులు చేయకుండా చేసినట్లు దొంగ రికార్డులను సృష్టించి సంస్థని బురిడీ కొట్టించారు. లక్షలాది రూపాయలను, కాంట్రాక్టర్ అధికారులు ఖజానాకు గండి కొట్టిన సంఘటన సంతోష్ నగర్ సరిల్ పరిధిలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. తమకు తెలియకుండానే డివిజన్లో అభివృద్ధి పనులు చేసినట్లు లెకలు చూపించిన అధికారుల భాగోతం వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు.
ఇదే విషయాన్ని కౌన్సిల్ వేదికగా స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన డివిజన్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. ఫోర్జరీ చేసి సదరు కాంట్రాక్టర్, ఇంజినీర్లు బిల్లులు నొక్కేసినట్లు తేల్చారు.
గత ఏడాది వినాయక చవితి ఉత్సవాలను పురసరించుకొని సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో సీసీ రోడ్డు నిర్మాణం కోసం పని ఐడీ 24041451, టెండర్ ఐడీ 53998 కేటాయించి, 8 లక్షల 93 వేల 223 రూపాయలను మంజూరు చేశారు. పని నిర్ధారించి తొమ్మిది లక్షల 90 వేలకు ప్రాజెక్టు అమౌంట్‌గా పేరొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌కు 2024 ఆగస్టు 26న అప్పగించారు. సదరు కాంట్రాక్టర్ స్థానికంగా ఎటువంటి సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేయకుండానే ఏకంగా మెజర్మెంట్ రికార్డు (ఎంబీ) బుక్‌లో పనులు పూర్తి చేసినట్లు పేరొంటూ బిల్లులు పెట్టగా మంజూరు చేశారు.
ఈ విషయంలో ఇంజినీర్లు కాంట్రాక్టర్ కుమ్మకై నకిలీ బిల్లులు సృష్టించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో అధికారులు సీసీ రోడ్డు వేసినట్లుగా చెబుతున్న ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియో, సీసీ కెమెరాల ఫుటేజ్, రికార్డులను కమిషనర్‌కు అందజేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ ఆర్ వీ కర్ణన్ బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ తరహా పాతబస్తీలో ఎక్కువగా జరుగుతున్నాయని, కమిషనర్ చొరవ తీసుకుని విచారణకు ఆదేశించాలని పలువురు కోరుతున్నారు.