మేడ్చల్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో శుక్రవారం జరిగిన గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల ఎంపికపై అధికారులను నిలదీశారు. గ్రామ, వార్డు సభల్లో చదువుతున్నది లబ్ధిదారుల జాబితా కాదని, దరఖాస్తుల జాబితానేని చెబుతున్నారని, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారందరివీ ఎందుకు చదవడం లేదని ఆరోపించారు.
జాబితాలో పేర్లు రాని వారివి దరఖాస్తులు మళ్లీ తీసుకున్న అధికారులు.. మళ్లీ ఎప్పుడు పరిశీలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు అటకెక్కించినట్టేనా అని అధికారులను నిలదీశారు. లబ్ధిదారుల ఎంపికపై నిర్వహించిన గ్రామ, వార్డు సభలు తూతూ మంత్రంగానే నిర్వహించినట్లు అర్ధమైతున్నదని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు.
దరఖాస్తుల వివరాల నమోదు తర్వాతే పరిశీలన..
గ్రామ, వార్డు సభల్లో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లలో నమోదు తర్వాతే దరఖాస్తుదారుల పరిశీలన జరుగుతుందని అధికారుల ద్వారా తెలుస్తున్నది. అయితే వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను నమోదు చేసేందుకు వారం రోజుల పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన చాలా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
ఈ నెల 26న నాలుగు గ్యారంటీల పథకాలను లబ్ధిదారులకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడేమో జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రకటించిన జాబితా దరఖాస్తుదారుదేనని మంత్రులు, అధికారులు చెబుతుండగా, మరి ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక జరగనట్టేనా అన్న అనుమనాలను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సభల్లో ప్రకటించిన దరఖాస్తుల జాబితాలనే అర్హులను ఎంపిక చేస్తారా అన్నది స్పష్టంగా అధికారులు చెప్పడం లేదు. కాగా, ఇప్పుడు వచ్చిన దరఖాస్తులతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించినట్లయితే డబులు దరఖాస్తులు వచ్చినట్లయింది.