ఖైరతాబాద్, మార్చి 23: పార్లమెంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు చట్టబద్ధతకు సహకరించిన బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం పొందేందుకు కూడా తగిన సహకారం అందించాలని కోరారు.
బీసీ ముస్లింలను సాకుగా చూపించి బిల్లును ఆమోదించకుండా పెండింగ్లో పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అలాగే పెండింగ్లో పెడితే కేంద్ర ప్రభుత్వానికి బీసీ సత్తా చూపిస్తామని తెలిపారు. ఏప్రిల్ 2లోగా పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదించాలని.. లేనిపక్షంలో ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది బీసీలతో పోరు గర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. 29 రాష్ట్రాల్లోని లక్షలాది బీసీలను ఢిల్లీకి తరలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఛలో ఢిల్లీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కనకాల శ్యామ్ కురుమ, మణిమంజరి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.