రవీంద్ర భారతి, జూన్ 1 : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. బి కేటగిరి సీట్లను ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా
భర్తీ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్లో విద్యార్థులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డొనేషన్లు తీసుకునే కళాశాలలపై చర్యలు చేపట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల పెంపునకు తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
కాలేజీలో ఫీజులు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల బకాయిలు ఇవ్వకుండా, ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసం అని రామకృష్ణ ప్రశ్నించారు. లక్షల్లో ఫీజులు పెంచుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై లక్షలాది రూపాయలు ఫీజుల భారం మోపుతూ పేద విద్యార్థులను చదువుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కోట్లాది రూపాయలు బడా కాంట్రాక్టర్లకు ఇస్తూ పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు పేద విద్యార్థులు చదువుకోకుండా ప్లీజ్ బకాయిలు ఇవ్వకుండా కాలేజీ ఫీజులు లక్షల్లో పెంచడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ద్వంద వైఖరిని విడనాడి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంచకుండా నిరోధించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి నిరసనలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.