ఖైరతాబాద్, మే 25 : బీసీల రాజ్యాధికారమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటి బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు చిరంజీవులు, సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. దేశంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడినా బీసీల సంక్షేమానికి ఎవరూ పాటుపడలేదని అన్నారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కుతూ వారి సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. బీసీల్లో చైతన్యం ప్రారంభమైందని, అది మండల స్థాయికి చేరిందని, గ్రామ స్థాయి నుంచి బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో బీసీలు ఓట్లు వేసి సంక్షేమ పథకాలను అడుక్కునే వారని, కాని ఇప్పుడు పరిస్థితి మారుతుందన్నారు. బీసీలందరూ బలోపేతమవుతున్నారని తెలిపారు. కోటి బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదుతో పార్టీలకు తమ సత్తాను చూపించాలని కోరారు. దేశంలోని బీసీలు అడుక్కునే స్థాయి కాకుండా ఇచ్చే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి బీసీ వ్యక్తి గర్వంగా సమితిలో సభ్యుడిని అని చెప్పుకునే విధంగా కార్యచారణ ఉండాలని సూచించారు.