ముషీరాబాద్, అక్టోబర్ 16: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ తలపెట్టిన బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ నిరసన వ్యక్తం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం విద్యానగర్ లో నిర్వహించిన కార్ల ర్యాలీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన బంద్‌లో అన్ని కుల సంఘాలు, పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. బీసీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించి చైతన్యవంతం చేయాలని, ఎమర్జెన్సీ మెడికల్ షాపులు మినహా మిగిలిన షాపులు, కాలేజీలు, స్కూల్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అని అన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజ్జ సత్యం, రాజ్‌కుమార్, రాజు నేత, అనంతయ్య, మణికంఠ పాల్గొన్నారు.