NIMS | ఖైరతాబాద్, మార్చి 2 : నిమ్స్ అంటేనే పేద, మధ్యతరగతి ప్రజలకు స్వస్థత చేకూర్చే వైద్యశాలగా గుర్తింపు ఉంది. నిత్యం సుమారు 3 వేల మంది రోగులు వివిధ రకాల చికిత్సల కోసం వస్తుంటారు. ఔట్ పేషెంట్ వార్డు, మిలీనియం, స్పెషాలిటీ, ఎమర్జెన్సీ బ్లాకులకు వచ్చే రోగులకు ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ స్కాన్, ఇతర పరీక్షల కోసం వారి సహాయకులతో కలిసి వివిధ బ్లాకులకు తిరగాల్సి ఉంటుంది. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సామాజిక బాధ్యతగా లక్షలాది రూపాయలు వెచ్చింది బ్యాటరీ వాహనాలను నిమ్స్‌కు సమకూర్చారు.
మొట్టమొదటిగా యూనియన్ బ్యాంకు వారు నాలుగు, మరో ప్రైవేట్ బ్యాంకు రెండు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మూడు బ్యాటరీ వాహనాలను నిమ్స్‌కు అందజేశారు. అయితే వాటిని ఎప్పకప్పుడు మెయింటెనెన్స్ జరగాలి. ఆ బాధ్యత మొత్తం నిమ్స్ యాజమాన్యానిదే. కానీ కొంతకాలం పలు వాహనాలు నిర్వహణ లేక మూలాన పడినట్లు తెలుస్తోంది. క్యాంటీన్ పక్కనే నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఉన్న రెండు, మూడు వాహనాలతోనే వెల్లదీస్తున్నారని, దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. నిర్వహణ చూసే సంస్థకు సంబంధించిన వారు అవసరం ఉన్నప్పుడు రాకపోవడం వల్లే వాటిని పక్కన పెట్టాల్సి వచ్చిందని పరిపాలన విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటికైనా అన్ని వాహనాలను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.