హైదరాబాద్ : నగరంలో చారిత్రక దిగుడు బావుల పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు సంయుక్తంగా నడుంబిగించాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 44 దిగుడు బావుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే ఆరు చోట్ల పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇందులో భాగంగానే బాపూఘాట్, గచ్చిబౌలి, గుడిమల్కాపూర్, శివబాగ్, బన్సీలాల్పేట, సీతారాంబాగ్లో పనులు తుది దశకు చేరుకుని పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.
బన్సీలాల్పేట్లోని నల్లపోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న 300 ఏండ్ల నాటి నాగన్నకుంట మెట్ల బావి పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బావిలో పేరుకుపోయిన చెత్తా చెదారం, వ్యర్థాలను తొలగించే పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ మెట్ల బావి పునరుద్ధరణ ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. మెట్ల బావి పునరుద్ధరణ పనులు స్టెప్ బై స్టెప్ కొనసాగుతున్నాయని తెలిపారు. పునరుద్ధరణకు ముందు, ఇప్పటి ఫోటోలను అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.
Rediscovering Bansilalpet #Stepwell step by step ..
— Arvind Kumar (@arvindkumar_ias) January 22, 2022
Before & after ( today morning's pics ) @ZC_Secunderabad @YadavTalasani @KTRTRS pic.twitter.com/vvmJMHyPYe
కొన్నేండ్లుగా నీటి నిల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారంతో పాటు ఇతర వస్తువులను తొలగిస్తున్నారు. బావి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. చెత్తను ఏరివేయడంతో ఆ మెట్ల బావి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.
మూడు అంతస్తులలో ఉన్న ఈ బావిలో మెట్లు, అందమైన శిల్పాలు, ఆకట్టుకునే రాతి నిర్మాణాలు ఉన్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ బావి అప్పట్లో పరిసర ప్రాంత ప్రజలకు తాగునీరు అందించింది. నిజాం సర్కారు సిబ్బంది ఇక్కడికి సమీపంలో డంగు సున్నం తయారుచేసే వారని, దానికి ఈ బావి ద్వారా నీటిని వాడుకునేవారు. అలాగే, నిజాం సర్కారులో వారు వాడే గుర్రాలు ఇక్కడే విశ్రాంతి తీసుకుని, బావిలోని నీటిని తాగించేవారని స్థానికులు చెబుతుంటారు.