Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. అదనంగా ఆదాయం వస్తుందని ఓ మిత్రుడి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చాడు. ప్రతీనెలా పదివేల వరకు ఆదాయం వస్తుంటే సంబరపడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైబర్‌క్రైమ్ పోలీసులు ఖాతాను ఫ్రీజ్ చేసి కేసు నమోదు చేయడంతో జైలుకెళ్లక తప్పలేదు.
ఇంట్లో ఉంటూనే సంపాదించాలనుకుంటే.. జీతం చాలక అదనపు ఆదాయం కావాలంటే సోషల్‌మీడియాలో వస్తున్న ప్రకటనలపై నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులపై ఆధారపడవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్ట్టైమ్జాబ్పేరుతో మోసగాళ్లు సోషల్‌మీడియాలో ప్రకటనలిచ్చి ఆకట్టుకుంటారు. చిరుద్యోగులు, ఆ టోడ్రైవర్లు, నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే టార్గెట్‌గా వారిని ఆకట్టుకుని ముగ్గులోకి దింపుతున్నారు. విద్యార్థులు, గృహిణులైతే తేలికగా మోసం చేయవచ్చని వలపన్నుతున్నారు. యూపీ, రాజస్థాన్, బీహార్, కర్ణాటకతో పాటు ఈశాన్యరాష్ర్టాలకు చెందిన కొందరు సైబర్‌నేరగాళ్ల ఏజెంట్లు సోషల్‌మీడియా వేదికగా ఈ దందా కొ నసాగిస్తున్నారు. అయితే ఖాతాతెరిచి ఇస్తే అందు లో డబ్బులు పడగానే అందులో పదిశాతం కమిషన్ ఇస్తామంటూ ఆశపెడుతున్నారు. దీంతో తమ ఖాతాలను అద్దెకివ్వడం కానీ, లేక కొత్త ఖాతాలు తెరవడం కానీ చేసి వాటిని సైబర్ ఏజెంట్లకు ఇస్తున్నారు. అందులో డబ్బులు పడగానే కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు. చాలామందికి ఇది సైబర్ నేరాలకు సంబంధించిన మోసమని తెలియకపోయినా డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఈ నేరాల్లో భాగస్వాములవుతున్నారు. పోలీసుల విచారణలో అసలు సూత్రధారులు దొరకకపోవడంతో ఈ ఖాతాలిచ్చినవారిని అరెస్ట్ చేస్తున్నారు.
ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను వారి మిత్రు లు, బంధువుల ద్వారా సంప్రదించి డబ్బులు వస్తాయని ఆశపెట్టి వారి ఖాతాలు తీసుకుని నెలకు ఆరువేల నుంచి ఎనిమిదివేల రూపాయలు మొదట్లో వేసి తర్వాత ఆ ఖాతాలను తమ లావాదేవీలకు వాడుకుంటున్నట్లు సైబర్ పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో విద్యార్థులు అమాయకంగా చిక్కుకుని కేసుల్లో ఇరుకుతున్నారు. మరోవైపు గృహిణులు సైతం తమ దగ్గరున్న ఖాతాల్లో ఏదో ఒకటి పెద్దగా వాడని అకౌంట్ ఇస్తే తమకు కమీషన్ డబ్బులు వస్తాయి కదా అన్న ఆశతో ఇచ్చి చిక్కుకుంటున్నారు.
ఈ ఖాతాల్లో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ , స్టాక్‌మార్కెట్, క్రిప్టో, బిట్‌కాయిన్ పెట్టుబడులు, బ్యాంకు ఓటీపీ వంటి మోసాలతో కొట్టేసిన సొ మ్మును జమచేయిస్తున్నారు. గంట వ్యవధిలో 10 నుంచి 12 ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. క్రిప్టో ఖాతా ఉన్న ఏజెంట్ ద్వారా నగదును క్రిప్టోగా మార్చి హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు. కమీషన్ కోసం ఆశపడి బ్యాంక్ ఖాతాలు సమర్పించినవారు కేసుల్లో చిక్కాక నానా తంటా లు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయాచితంగా వచ్చే సొమ్ము కోసం ఆశపడవద్దని, కమీషన్ల పేరుతో సైబర్ మోసగాళ్లు వేసే పన్నాగంలో చిక్కుకోవద్దని సైబర్ పోలీసులు సూచించారు.