Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 11: యువతిని వెంటపడి వేధిస్తుండడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో నివాసం ఉంటున్న యువతి (27) ఓ ప్రైవేటు సంస్థలో జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్గా పని చేస్తుంటారు. ఆమెతోపాటు గతంలో ఓ సంస్థలో కలిసి పనిచేసిన క్రాంతి కుమార్ అనే వ్యక్తి కొన్ని నెలలుగా ఆమెను వెంటపడి వేధిస్తున్నాడు. తనను వెంబడించొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. గురువారం సాయంత్రం క్రాంతి కుమార్ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అడ్డగించి ఇబ్బందులకు గురి చేశాడు. క్రాంతి కుమార్ వేధింపులు తాళలేక, చివరకు బాధితురాలు శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.