Cyber Crime | బంజారాహిల్స్, ఏప్రిల్ 20 : ఆర్థిక పరమైన వ్యవహారాలలో తప్పు చేశావని.. దీంతో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ ఫోన్ చేసి బెదిరించడంతో పాటు అకౌంట్ నుంచి డబ్బులు తస్కరించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 14లో నివాసం ఉంటున్న రమేష్‌రెడ్డి అనే వ్యాపారికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ బ్యాంకు ఖాతాలో జరిగిన లావాదేవీలో తప్పులు జరిగాయని, దీనిపై ముంబై సైబర్ క్రైం స్టేషన్లో కేసు నమోదయిందని చెప్పాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని రమేష్‌రెడ్డి చెప్పగా రెండువారాల ముందు నీ అకౌంట్లోనుంచి రూ.70 వేలు ఎక్కడకు వెళ్లాయో చూసుకోవాలంటూ దబాయించారు. అప్పుడు తన అకౌంట్ చేసుకోగా రూ.70 వేలు సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు తేలింది. దీంతో భారీ స్కెచ్‌లో భాగంగా తనను ఇరికేంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన బాధితుడు ఈ మేరకు సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడంతో పాటు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.