మణికొండ, ఏప్రిల్ 23 : బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుధీర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. అధికారులు ఇతడికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీనిని అనుకూలంగా మార్చుకున్న సుధీర్.. బంగ్లాదేశీయుడికి నార్సిం గిలో జన్మించిన వ్యక్తిగా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు.
సుమారు రెండేళ్ల కిందట ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు.. ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీసు వెరిఫికేషన్లో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుధీర్ తో పాటు సదరు బంగ్లాదేశ్ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సుధీర్ రెండేండ్ల కిందట ఒకరికి అప్పటి కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు తెలిసింది. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నా మని, అతన్ని అదుపులోకి తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. , విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని కోరారు.
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి కొంతమంది యువకులు అక్రమ దారిలో వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యువకుడికి అక్రమ దారిలో మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ అప్పటి కమిషనర్ సత్యబాబుతో కలిసి రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసింది.
ఇతడితో పాటు మరికొంతమంది విదేశీయులకు సర్టిఫికెట్లు, డూప్లికేట్ పత్రాలను కూడా ఈ ముఠా కొంతమంది స్థానిక వ్యక్తుల సహాయంతో చేసినట్లు తెలిసింది. ఒక నార్సింగ్ మున్సిపాలిటీలోని దాదాపు 20 మంది ఇతర దేశాల( బంగ్లాదేశ్, పాకిస్తాన్) నుంచి వచ్చి తప్పుడు పత్రాలతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిసింది. వీరిపైనా టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.