కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మైనర్ బాలిక అని తెలిసి కూడా బండి సంజయ్ కుమారుడు అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన భగీరథ్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
హైదరాబాద్ చిలుకానగర్‌లో బండారి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కై డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా, బండి కుమారుడిని కాపాడేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయమా అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోక్సో కేసులో బండి సంజయ్‌కు సహకరిస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు. బాలికపై హనీట్రాప్, వసూళ్ల కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా అని నిలదీశారు. బండి సంజయ్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు.