హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలతో రేవంత్‌రెడ్డి కూడా సన్నిహితంగా ఉంటున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి పెద్దమ్మ, చిన్నమ్మ కొడుకుల్లా మసులుకుంటారని, రామ్‌కో సిమెంట్ కంటే ధృడంగా వారిరువురి బంధం కొనసాగుతున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంకే దొరకని ప్రధాని అపాయింట్మెంట్ రేవంత్‌కు దొరుకుతున్నదని దుయ్యబట్టారు. ఒక బీజేపీ ఎంపీకి ఒక కాంట్రాక్టు కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పటినుంచే ఆ ఎంపీతో రేవంత్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బండి సంజ య్ కేంద్ర సహాయ మంత్రిగా కాకుండా, రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది రోజులుగా సీఎం గల్లీ, గల్లీ తిరుగుతున్నారంటేనే పరిస్థితి అర్థమవుతున్నదని, ఆయన మాట్లాడే భాష తీరు కూడా తన ఓటమికి అద్దం పడుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఇండ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లేకపోయినప్పటికీ శుక్రవారం పోలీసులు బరితెగించి రైడ్ చేశారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగానే పనిచేస్తున్నాయని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడి, కాంగ్రెస్‌కు సహకారం అందిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఎన్నికల కమిషన్, అధికారులు, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో బైండోవర్ చేసిన 140 మందిని ఈ నెల 11న పోలింగ్ రోజున బయటకు రానీయొద్దని ఈసీఐని కోరినట్టు తెలిపారు. జూబ్లీహిల్స్‌లో పోలీసుల దౌర్జన్యం, అరాచకాలు ఎక్కువయ్యాయని, వారు రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని ఆరోపించారు.