Hyderabad | సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వానలు షురువయ్యాయి. 2009 తరువాత 15 రోజుల ముందే వర్షాకాలం ప్రారంభమైంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా వానలు కురుస్తుండటంతో నగరం అప్పుడే చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో పాటు గాలిలో తేమ శాతం పెరగడంతో వాతావరణం కొంత చల్లబడింది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో కూడిన సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉందంటున్నారు వైద్యనిపుణులు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించడం సహజమే అయినప్పటికీ ఈసారి అనుకోకుండా 15 రోజుల ముందే వానలు కురుస్తుండటం, దానికి తోడు దేశవ్యాప్తంగా కరోనా కేసులు కలవరపెడుతుండటంతో పరిస్థితి అయోమయంగా మారింది.
మొదలైన దోమల బెడద..
నాలుగైదు వర్షాలు కురిశాయో లేదో అప్పుడే దోమల బెడద మొదలైంది. దాదాపు గ్రేటర్‌లోని చాలా ప్రాంతాల్లో దోమ లు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి వర్షాకాలం ప్రారంభానికి ముందే జీహెచ్ఎంసీ అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అటు జీహెచ్ఎంసీ అధికారులు గానీ, ఇటు వైద్యాధికారులు గానీ సీజనల్ నివారణ చర్యలు తీసుకోవడం లేదు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు యాంటీ లార్వా, ఫాగింగ్ తదితర చర్యలు చేపట్టాలి. అంతే కాకుండా బస్తీలు, కాలనీలు, ముఖ్యంగా మురికి వాడల్లో కాలువలు, కుంటలు, నాలాల్లో దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలి. కానీ సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని వైద్యశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల దోమలు వృద్ధిచెంది సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశాలు లేకపోలేదంటున్నారు వైద్యనిపుణులు.
సాధారణంగా..
సాధారణంగా వర్షాకాలంలో ఫ్యాక్టరేబుల్ డిసీజెస్(దోమకాటుతో వచ్చే వ్యాధులు), వాటర్ బాండరెబుల్ డిసీజెస్(నీటివల్ల వచ్చే వ్యాధులు) వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వర్షాల వల్ల జలుబు, జ్వరం, దగ్గుతో పాటు వైరల్ ఫీవర్స్, ఫ్లూ వంటివే కాకుండా దోమ కాటు వల్ల డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, కలుషిత ఆహారం, నీటి వల్ల డయేరియా, కామెర్లు, టైఫాయిడ్, హెపటైటిస్ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా అలజడి సమయంలో సీజనల్ లక్షణాలు, కరోనా లక్షణాలను బేరీజు వేసుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది.
ముఖ్యంగా వర్షంలో తడిసిన వారికి లేదా వాతావరణ మార్పుల కారణంగా జలుబు, జ్వరం, దగ్గు రావడం సహజం. అదే సమయంలో కరోనా సోకినా దానిని సీజనల్‌గా భావించే ప్రమాదం లేకపోలేదు. సీజనల్లో వచ్చే వ్యాధుల్లో ప్రధానంగా డెంగీ, మలేరియా, డయేరియా ప్రభావం కూడా ఉంటుంది. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భయాందోళనలను పక్కన బెట్టి జాగ్రత్తలు మాత్రం పాటిస్తే అందరికీ మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. జనవాసాల మధ్య వెళ్లినప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసినప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల కరోనా నుంచే కాకుండా సీజనల్‌గా వచ్చే ఇన్ఫ్లూయంజా వంటి ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చంటున్నారు వైద్యులు.
అంతే కాకుండా దోమల బారిన పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, అవసరమైతే వారి సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనుమానిత లక్షణాలున్న వారు కొవిడ్ టెస్ట్ నివేదిక వచ్చే వరకు స్వీయ ఐసొలేషన్ పాటించాలని, పాజిటివ్ వచ్చిన వారు మాత్రం వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్‌ను పాటిస్తూ తగిన మందులు వాడాలని సూచిస్తున్నారు.