Cyberabad Commissionerate | సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. దసరా, సంక్రాంత్రి పండుగ సమయాల్లో నగరం నుంచి దాదాపు 60 శాతం మంది తమ తమ సొంత ఊళ్లకు వెళ్తుంటారు. అదే అవకాశంగా తీసుకుంటున్న నేరగాళ్లు తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేరాలను ప్రతి దసరా, సంక్రాంతి సమయాల్లో చూస్తుంటాం.
అయితే, గత కొనేండ్లుగా దొంగతనాలను కట్టడి చేస్తున్న పోలీసులు.. ఈసారి కమిషనరేట్ పరిధిలో ఎలాంటి దోపిడీ, దొంగతనాలకు అవకాశం లేకుండా పటిష్ట నిఘా పెట్టారు. పండుగకు ముందే ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ఊళ్లకు వెళ్లేవారు స్థానిక ఠాణాల్లో సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల 11నుంచి కమిషనరేట్‌లోని అన్ని ఠాణాల పరిధిలో ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ..
రోజువారీ పోలీసు గస్తీకి అదనంగా దసరా పండుగ సందర్భంగా రాత్రి సమయాల్లో కాలనీలు, బస్తీల్లో ప్రత్యేకంగా పాట్రోలింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, బస్తీలు, తక్కువ జనం ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సైబరాబాద్ క్రైమ్ విభాగం అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో స్థానిక పోలీసు స్టేషన్ నుంచే కాకుండా ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులకు సంబంధించిన టీమ్‌లు, సీసీఎస్, ఎస్ఓటీ బృందాలు కూడా గస్తీ తిరుగుతూ నిఘా పెట్టాయి. సీసీ కెమెరాలు లేని కాలనీల్లో ప్రత్యేక నిఘా పెట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
పాత నేరస్థుల కదలికలపై నిఘా..
దోపిడీ, దొంగతనాలకు సంబంధించి పాత నేరస్థుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పండుగ సందర్భంగా చెడ్డీ గ్యాంగ్, ధార్ గ్యాంగ్ వంటి దొంగల ముఠాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో ఈసారి దొంగతనాలు, దోపిడీలను పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఠాణాల వారీగా సంబంధిత సెక్టార్ ఎస్ఐలు ఖచ్చితంగా పెట్రోలింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా.. డివిజినల్, జోనల్ స్థాయి అధికారులు సైతం గస్తీ నిర్వహించడంతో పాటు స్థానిక స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.